శ్రీ:
శ్రీ మతే రామానుజాయ నమః
శ్రీ మద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
జై శ్రీమన్నారయణ
తిరునక్షత్రము : భాద్రపద మాసము, మఖ నక్షత్రము
తీర్థము : వృశ్చికము,శుక్ల పంచమి
ఆచార్యులు : మణవాళ మామునులు
రచనలు : వరవమురముని వైభవవిజయము
వీరు ముదలిఆండాన్( ముదలిఆండాన్ యతిరాజ పాదుకగా ప్రసిద్ది గాంచారు) వంశములోని కోయిల్ కందాడైఅన్నన్ సోదరుడిగా,దేవరాజ తొళప్పర్కు కుమారులుగా జన్మించారు .తల్లి దండ్రులు వీరికి పెట్టిన పేరు శ్రీనివాసన్.తరవాతికాలములో మామునుల ప్రియశిష్యులైనారు.
మామునులు ఆళ్వార్ తిరునగరి నుండి శ్రీరంగము వెంచేసినప్పుడు , శ్రీ రంగనాథుడు వారిని సత్సంప్రదాయమునకు మూల స్థానమైన శ్రీ రంగము లో ఉండి సంప్రదాయాన్ని ప్రవృద్ధి పరచాలని ఆదేశించారు. మామునులు శ్రీరంగములో వేంచేసి సత్సాంప్రదాయ ప్రవర్తము చేస్తూ,పూర్వాచార్య గ్రంథములను సేకరించిభద్రపరిచటమే కాక నిత్యము గ్రంథ కాలక్షేపము చేసేవారు.వారి ఙ్ఞాన సంపదకు,వాక్పటిమకు ఆకర్షితులై ఎందరో మహాచార్యులు కూడా వారి శ్రీచరణాలను ఆశ్రయించారు.
ఆక్రమములోనే అప్పటికే ప్రముఖ ఆచార్యపురుషులుగా ప్రసిద్ది గాంచిన కోయిల్ కందాడై అన్నన్ సపరివారముగా మామునుల శిష్యులై తరవాతి కాలములో అష్టదిగ్గజములలో ఒకరై వెలుగొందారు.(మామునులు సత్సాంప్రదాయ ప్రవర్తము కోసము ఎనిదిమంది మహాచార్యులను నియమిచారు. వారినే అష్ట దిగ్గజములని అంటారు.) కోయిల్ కందాడై అప్పన్ కూడా తమ అన్నగారితో మామునుల వద్దకు వచ్చినవారే.వీరు చరమపర్వ నిష్ఠను(భాగవత్ మరియు ఆచార్య కైంకర్యం) పాటించి తరించినవారని వారి తనియన్ ద్వారా తెలుస్తుంది.
ఎరుమ్బి అప్పా తన పూర్వదినచర్య(మామునుల దినచర్య)లో వీరిని ఈక్రింది విధముగా కీర్తించారు.
‘పార్శ్వాతః పాణిపాదాభ్యామ్ పరిగ్రుహ్యభవాత్ప్రియౌ
విన్యశ్తన్యం సనైరంగ్రి మృదులౌ మేధినీతలే ‘
అర్థము:ఎరుమ్బి అప్పా మామునుల తో – తమ(మామునుల) గొప్పతనము తమ ప్రియ శిష్యులిరువురూ(కోయిల్ అన్నన్,కోయిల్ అప్పన్)ఇరు వైపులా చేరగా , వారిని మీ సుతిమెత్తని చేతులతో గట్టిగా పట్టుకొని , ఈ మేదిని పై మీ చరణ కమలము మోపి నడవటము.
తిరుమళిశై అణ్ణావప్పన్గార్,దినచర్యకు వ్యాఖ్యానము లో ఇక్కడ శిష్యులంటే‘ కోయిల్ అన్నన్,కోయిల్ అప్పన్‘ అన్నారు.ఆ కాలములో మామునులు పాంచరాత్ర ఆగమము ప్రకారము ఎల్లవేళలా త్రిదన్డము చేత ధరించటము లేదని ఒక సందేహము ప్రజలలో ఉండేది. దానికి అణ్ణావప్పన్గార్ చక్కటి సమాధానము చెప్పారు.
* ఎవరైతే సన్యాశి ధర్మములు బాగా తెలిసి ప్రఙ్ఞ కలిగి వుంటారో వారు కారణాంతరముల వలన త్రిదండము చేత పట్టకున్నా తప్పు లేదు.
* ఏ సన్యాసైతే నిరంతరము భగవద్యానములో కాలము గడుపుతారో, ఆచార్యముఖముగా శాస్త్రవిషయములను విన్నారో, భగవద్విషయములో పరిపూర్ణ అధికారము కలిగి వుంటారో, బాహ్య అంతర్గత ఇంద్రియ నిగ్రహము కలిగి వుంటారో వారికి త్రిదండముతో పని లేదు.
*పరమాత్మకు సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించే సమయములో త్రిదండము అడ్డుగా వుంటుంది. అందువలన అలాంటి సమయములలో త్రిదండము ధరించకున్నను పరవాలేదు.
ఈ విధముగా కొయిల్ కందాడై అన్నన్ ప్రభవమును గురించి తెలుసుకున్నాము.వారి శ్రీచరణములను ఆశ్రయించి తరించుదాము రండి.
కోయిల్ కందాడై అన్నన్ తనియన్:
వరదగురు చరణమ్ వరవరమునివర్య ఘనకృపా పాత్రమ్
ప్రవరగుణ రత్నజలధిమ్ ప్రణమామి .శ్రీనివాసగురువర్యమ్.
అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజదాసి.
3 thoughts on “కోయిల్ కన్దాడై అప్పన్”