శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
గత సంచికలో మనం నంపిళ్ళై వారి గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు గురుపరంపరలో తరువాతి ఆచార్యుల గురించి తెలుసుకొందాం.
వడక్కు తిరువీధి పిళ్ళై – కాంచీపురము
తిరునక్షత్రము: స్వాతి – ఆషాడమాసము
అవతార స్థలము: శ్రీరంగము
ఆచార్యులు: నంపిళ్ళై
శిశ్యులు: పిళ్ళై లోకాచార్యులు, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ మొదలైనవారు
పరమపదము చేరిన ప్రదేశము: శ్రీరంగం
శ్రీసూక్తులు: ఈడు 36000 పడి
శ్రీకృష్ణపాదర్లుగా జన్మించిరి, వడక్కు తిరువీధి పిళ్ళైగా ప్రసిద్దికెక్కిరి. నంపిళ్ళై ముఖ్య శిశ్యులలో వీరు ఒకరు.
వడక్కు తిరువీధి పిళ్ళై గృహస్తాశ్రమములో ఉన్నప్పడికినీ పిల్లలకు జన్మనిచ్చుటకు ఇష్టంలేక పూర్తిగా ఆచార్య నిష్ఠయందు ఉండెను. వారి అమ్మగారు అది చూసి కలత చెంది నంపిళ్ళై వద్దకు వెళ్ళి వడక్కు తిరువీధి పిళ్ళైల స్వభావమును గూర్చి చెప్పెను. అది విని, నంపిళ్ళై వడక్కు తిరువీధి పిళ్ళైని, అతని భార్యని రమ్మని, అతడి భార్యని తన కృపచే దీవించి వడక్కు తిరువీధి పిళ్ళైలను పిల్లలకు జన్మనిచ్చుటకు ప్రయత్నము చేయవలెనని ఆఙ్ఞాపించిరి. ఆచార్యుల ఆఙ్ఞను అంగీకరించి వడక్కు తిరువీది పిళ్ళై అలానే చేసిరి. త్వరలోనే వడక్కు తిరువీధి పిళ్ళై ధర్మ పత్ని ఒక బిడ్డను జన్మ నిచ్చెను. నంపిళ్ళై (లోకాచార్య) అనుగ్రహంతో జన్మించిన ఆ బిడ్డకు పిళ్ళై లోకాచార్య అని నామకరణము చేసిరి. అది విని, నంపిళ్ళై ఆ శిశువుకు అళగియ మణవాళన్ అనే పేరు పెడుదామనుకొన్నామనిరి. నమ్పెరుమాళ్ళు కూడా విని వడక్కు తిరువీధి పిళ్ళైలకు మరియొక శిశువు జన్మించేలా దీవించిరి. ఈ బిడ్డ అళగియ మణవాళన్ (నంపెరుమాళ్ళ) కృపతో జన్మించిన కారణముగా, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ అని నామకరణము చేసిరి. ఆ విధముగా వడక్కు తిరువీది పిళ్ళై రెండు రత్నములను మన సంప్రదాయమునకు ఇచ్చిరి. వీరిని పెరియాళ్వార్లతో పోల్చుదురు:
- ఆళ్వార్, వడక్కు తిరువీధి పిళ్ళై ఇద్దరూ ఆషాడమాసమున స్వాతి నక్షత్రములో జన్మించిరి.
- ఆళ్వార్ భగవత్ కృపతో తిరుపల్లాండు, పెరియాళ్వార్ తిరుమొళి వ్రాసిరి. వడక్కు తిరువీధి పిళ్ళై ఈడు 36000 పడి నంపిళ్ళై కృపతో వ్రాసెను.
- ఆళ్వార్ ఆండాళ్ని మన సంప్రదాయమునకు ఇచ్చిరి. క్రిష్ణానుభవముతో ఆమెను పెంచి పెద్ద చేసిరి. వడక్కు తిరువీధి పిళ్ళై పిళ్ళై తమ ఇద్దరు పుత్రులు పిళ్ళై లోకాచార్యులు, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లను భగవత్ అనుభవముతో పెంచి పెద్ద చేసిరి.
వడక్కు తిరువీధి పిళ్ళై తిరువాయ్మొళి ప్రవచనములను నంపిళ్ళై వద్ద వింటూ, పగటి వేళలో ఆచార్యుల వద్ద గడిపి, రాత్రి వేళలో వారు చెప్పినది పత్రాలపై వ్రాసి ఉంచేవారు. ఆ విధముగా వీరు ఈడు 36000 పడి వ్యాఖ్యానమును నంపిళ్ళైల ప్రవచనములు గ్రహించి నంపిళ్ళైలకు తెలియకుండా వ్రాసిరి. ఒకసారి వడక్కు తిరువీధి పిళ్ళై నంపిళ్ళైను తదియారాధనము కొరకై వారి తిరుమాళిగైకు ఆహ్వానించగా నంపిళ్ళై అంగీకరించి వారి తిరుమాళిగైకు వచ్చిరి. నంపిళ్ళై కోయిలాళ్వార్నందు తిరువారాధనమును చేయుటకు వెళ్ళగా, కోయిలాళ్వార్లో పత్రాలపైన వ్రాసిన వ్యాఖ్యానమును గమనించి, ఆసక్తితో వాటిలో కొన్ని చదివి వడక్కు తిరువీధి పిళ్ళైని అవి ఏమిటని ప్రశ్నించిరి. వడక్కు తిరువీధి పిళ్ళై నంపిళ్ళైల ప్రవచనములను వ్రాసి నమోదు చేసి ఉంచుదుమని వివరణ ఇచ్చిరి. నంపిళ్ళై వడక్కు తిరువీధి పిళ్ళైని తిరువారాధనము చేయమని ఆదేశించి, వారు మిగిలినవి చదవడము ప్రారంభించిరి. వారు పెరియ వాచ్చాన్ పిళ్ళై, ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళను వ్రాయమని అప్పటికే నిర్దేశించిరి. పెరియ వాచ్చాన్ పిళ్ళై, ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళతో ఆ వ్యాఖ్యానమును వారు చదివించి, ఎంతో వైభవముగా ఉన్నాయని ప్రశంసించి నంపిళ్ళై వడక్కు తిరువీధి పిళ్ళైలను ఈ విధముగా తమ అనుమతి లేకుండా ఎందుకు వ్రాసారు, పెరియ వాచాన్ పిళ్ళైల వ్యాఖ్యానమునకు పోటిగా వ్రాస్తున్నారా అని అడిగిరి. వడక్కు తిరువీధి పిళ్ళై తన వలన జరిగిన అపరాధనమునకు చింతించి, నంపిళ్ళై పాద పద్మములందు సాష్టాంగ నమస్కారం చేసి భవిష్యత్తులో చదువుకోడానికి వీలుగా ఉండునని వివరణ ఇచ్చిరి. వారి వివరణకు సంతృప్తి చెంది, తన ప్రవచనములలో నుండి ఒక్క రవ్వంత కూడా తప్పకుండా వ్రాసిరని నంపిళ్ళై ఆ వ్యాఖ్యానములను ప్రశంసించిరి. దానిని తన రాబోయే తరాలకు ఉపదేశించడము వలన, కడకు మణవాళ మామునులకు చేరునని భావించి నంపిళ్ళై ఈ వ్యాఖ్యానమును ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళకు ఇవ్వమనిరి. భగవత్ కృపచే, నంపిళ్ళై భవిష్యత్తు కాలములో మాముణుల అవతారమును ముందుగానే ఊహించి ఆ విషయమును ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళకి చెప్పి, వారి తరువాత తరాల ద్వారా, అది మామునులకు చేరి సరి యగు సమయములో మొత్తము ప్రపంచమునకే తెలియునని చెప్పిరి.
నంపిళ్ళై పరమపదమునకు చేరిన తదుపరి వడక్కు తిరువీధి పిళ్ళై మన సంప్రదాయమునకు నాయకత్వము వహించి, అన్ని అర్థములను పిళ్ళై లోకాచార్యులకు, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లకు ఉపదేశించిరి. పిళ్ళై లోకాచార్యులు తమ శ్రీవచన భూశణ దివ్య శాస్త్రములో వడక్కు తిరువీధి పిళ్ళైల ఆదేశములను కొన్ని చోట్ల ప్రస్తావించెను.
సూత్రం 77 లో, అహంకారమును వదిలిన ఆత్మను మాత్రమే ‘అడియేన్’ అని పిలువబడును అని పిళ్ళై లోకాచార్యులు వివరించిరి. ఇది యతీంద్ర ప్రవణ ప్రభావములో వడక్కు తిరువీధి పిళ్ళైచే వివరించబడినది.
సూత్రం 443 లో, వడక్కు తిరువీధి పిళ్ళై ఈ విధముగా వివరించెదరని పిళ్ళై లోకాచార్యులు అనెను. అనాది కాలముగా స్వ స్వాతంత్ర్యంతో నిండి ఉన్న జీవాత్మలు ఈ సంసారము నుండి విముక్తులు కావడానికి సదాచార్యున్ని ఆశ్రయించుటయే ఒకే ఒక్క మార్గము అని చెప్పిరి.
తరువాత కొంత కాలమునకు వడక్కు తిరువీధి పిళ్ళై తమ ఆచార్యులైన నంపిళ్ళైలని తలుచుకొని తమ దేహాన్ని వదిలి పరమపదమునకు చేరిరి.
ఎంబెరుమానార్లతో, మన ఆచార్యులతో అలాంటి అనుబంధము మనందరికి కలిగేలా మనము వడక్కు తిరువీధి పిళ్ళైల శ్రీచరణములను ప్రార్థిద్దాము.
వడక్కు తిరువీధి పిళ్ళైల తనియన్:
శ్రీ క్రిష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా ।
యత్ ప్రసాద ప్రభావేన సర్వ సిద్దిరభూన్మమ॥
మన తదుపరి సంచికలో పిళ్ళై లోకాచార్యుల వైభవమును చూద్దాము.
రఘు వంశీ రామానుజ దాసన్
మూలము: https://guruparamparai.koyil.org/2012/09/17/vadakku-thiruveedhi-pillai/
పొందుపరిచిన స్థానము – https://guruparamparai.koyil.org/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org
7 thoughts on “వడక్కు తిరువీధి పిళ్ళై”