శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
గత సంచికలో మనము పిళ్ళై లోకాచార్యుల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల గురించి తెలుసుకొందాం.
తిరువాయ్మొళి పిళ్ళై – కుంతీ నగరము (కొంతగై)
తిరునక్షత్రము: వైశాఖ మాసము, విశాఖ నక్షత్రము
అవతార స్థలము: కుంతీ నగరము (కొంతగై)
ఆచార్యులు : పిళ్ళై లోకాచార్యులు
శిశ్యులు: అళగియ మణవాళ మామునులు, శఠగోప జీయర్ (భవిష్యదాచార్య సన్నిధి), తత్వేస జీయర్, మొదలైన
పరమపదం చేరిన స్థలము: ఆళ్వార్ తిరునగరి
శ్రీసూక్తులు: పెరియాళ్వార్ తిరుమొళి స్వాపదేశము.
తిరుమలై ఆళ్వార్ గా జన్మించి, శ్రీశైలేశర్, శఠగోప దాసర్ గా వ్యవహరింపబడి తుదకు ఆళ్వార్లకు తిరువాయ్మొళిపై ఉన్న శ్రద్దకు, దానిని విస్తరించడములో వారు సల్పిన కృషికి ఫలితముగా తిరువాయ్మొళి పిళ్ళైగా ప్రసిద్దిగాంచిరి.
తిరుమలై ఆళ్వార్ తమ చిన్న వయస్సులోనే పిళ్ళై లోకాచార్యుల శ్రీచరణముల వద్ద పంచ సంస్కారములను పొందారు. వీరు తమిళ భాష పండితులు, గొప్ప పరిపాలనాధ్యక్షులు కూడా. వీరు సంప్రదాయానికి దూరమై మధురై రాజ్యమునకు ముఖ్య సలహాదారుడిగా ఉన్నారు. ఆ రాజు తన చిన్న వయస్సులోనే మరణించడము వలన వారి కూమారుల సంరక్షణ బాధ్యతలు తిరుమలై ఆళ్వారు నిర్వహించేవారు. పిళ్ళై లోకాచార్యులు తమ చివరి రోజుల్లో, తన దివ్య కృపను తిరుమలై ఆళ్వారుపై ప్రసరింపజేసి, మన సంప్రదాయానికి నాయకుడిగా తీర్చిదిద్దమని కూర కులోత్తమ దాసులను, ఇతర శిశ్యులను ఆఙ్ఞాపించారు. కూర కులోత్తమ దాసులు తిరుమలై ఆళ్వారును కలుసుకొని సంస్కరించే ప్రయత్నం మొదలు పెట్టారు.
ఆ సమయములో (మహమ్మదీయుల దండయాత్ర ముగిసిన కొద్ది కాలానికి), నమ్మాళ్వార్లు ఆళ్వార్తిరునగరి నుండి వచ్చి నంపెరుమాళ్ళతో కొంత కాలము కోళికోడిలో ఉంటున్నారు. నంపెరుమాళ్ళు అక్కడి నుండి బయలుదేరారు. కానీ, అక్కడి స్తానికుల మధ్య కొన్ని భేదాభిప్రాయాల కారణంగా, ఆళ్వార్ వారి వెంట వెళ్ళలేక పోయారు. అప్పుడు ఆళ్వార్ను తీసుకొని పడమటి కొండ ప్రాంతాలలో వెళ్ళునప్పుడు దొంగల భయం కారణంగా వారిని ఒక పెట్టెలో ఉంచి ఒక చిన్న రాతి కొండ క్రింద భద్రపరచారు. తరువాత కొంతకాలానికి, తోళప్పర్ అనే ఒక శ్రీవైష్ణవుడు నమ్మాళ్వార్లపైన ఉన్న భక్తితో, తిరుమలై ఆళ్వారు దగ్గరకు వచ్చి, నమ్మాళ్వార్లను తిరిగి తీసుకురావాలని, దానికి రక్షణగా కొందరు సైనికులను తనతో పంపమని అభ్యర్తించారు. తిరుమలై ఆళ్వార్ సంతోషంగా కావలసిన ఏర్పాట్లు చేయగా తోళప్పర్ నమ్మాళ్వార్లను భద్రపరచిన ఆ కొండ ప్రదేశానికి దారి చూపారు. అందరూ ఆ కొండ లోయలోకి ద్రిగడానికి సంకోచించుచుండగా తోళప్పర్ తానే క్రిందికి దిగారు. ఆళ్వార్ తిరునగరి నుండి వచ్చిన శ్రీవైష్ణవులు తోళప్పర్ సాహసాన్ని అభినందిస్తూ ఆ దినము నుండి ఆళ్వార్ ప్రత్యేక మర్యాదలు/ప్రసాదాలు మొదట వారికి లభించునని అన్నారు. వారు ఒక తాడు సహాయముతో క్రిందికి దిగి నమ్మాళ్వార్లను జాగ్రత్తగా పైకి పంపారు. రెండవ సారి ఆ తాడును క్రిందికి వేసి తోళప్పర్ను పైకి తీసుకువస్తుండగా వారు జారి కొండ లోయలో పడి వెంటనే పరమపదాన్ని చేరుకొన్నారు. నమ్మాళ్వార్లు స్వయంగా తోళప్పర్ల కుమారులను సమాధానపరిచి, తామే వారికి తండ్రిగా ఉంటామని అభయమిచ్చారు. ఆ విధముగా తోళప్పరుల కృషి వలన (తిరుమలై ఆళ్వారుల సహాయముతో) నమ్మాళ్వార్లను తిరిగి తిరుక్కనంబికి తీసుకురాగా అప్పడి నుండి వారు అక్కడే ఉండిపోయారు.
ఇప్పుడు తిరుమలై ఆళ్వారుల గురించి చూద్దాము. ఒకసారి తిరుమలై ఆళ్వార్ యథా విధిగా తమ పల్లకిలో కూర్చోని వస్తుండగా కూర కులోత్తమ దాసులు నమ్మాళ్వార్ల తిరువిరుత్తము పాశురాలను సేవించడం గమనించారు. పిళ్ళై లోకాచార్యుల ఆశీసులు తిరుమలై ఆళ్వారుపైన పరిపూర్ణముగా ఉండుట వలన, వారు దాసుల గొప్పతనము గ్రహించి, పల్లకి నుండి దిగి దాసరులను తిరువిరుత్తము అర్థాలను తెలుపమని అభ్యర్తించారు. కూర కులోత్తమ దాసులు ఇప్పుడు వీలుకాదని చెప్పారు. దానితో వారిరి మధ్య కొద్దిగా వాగ్వాదము జరిగెను. అది చూసిన తిరుమలై ఆళ్వారుల సేవకులు దాసరులకి హాని తలపెట్ట పోగా, తిరుమలై ఆళ్వార్ సాత్వికుడుగా ఉండడము వలన వారిని వారించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వారు తమ పెంచిన తల్లికి జరిగిన సంఘటన గురించి తెలిపారు. ఆవిడ పిళ్ళై లోకాచార్యులతో గల సంబంధమును గుర్తు చేసి మందలించారు. వెంటనే తిరుమలై ఆళ్వార్ తాను ఇంత వరకు ఏమి కోల్పోయారో గ్రహించి దుఖించారు. మరలా, ఒక నాడు తిరుమలై ఆళ్వార్ ఏనుగుపై వెళుతుండగా కూర కులోత్తమ దాసులను చూసిన వీరు ఈసారి వెంటనే క్రిందికు దిగి వారి శ్రీ చరణముల వద్ద సాష్టాంగ ప్రణామమును సమర్పించుకున్నారు. అప్పుడు కూర కులోత్తమ దాసులు వారికి శాస్త్రార్థాలను ఉపదేశించుటకు ఒప్పుకుంటారు. కూర కులోత్తమ దాసుల తిరువారాధనము కొరకై తిరుమలై ఆళ్వార్ అన్ని వసతులతో ఒక అగ్రహారమును ప్రత్యేకంగా నిర్మింపజేస్తారు. పరిపాలనా వ్యవహారాల వల్ల తీరిక లేనివాడైనందుకు, దాసరులను తాను ఊర్ధ్వ పుండ్రాలను ధరించే సమయములో ప్రతి నిత్యము రావలేనని ప్రార్థించారు. మొదటి సారి దాసర్ వచ్చినప్పుడు తిరుమలై ఆళ్వార్ ఊర్ధ్వ పుండ్రాలను ధరించేటప్పుడు పిళ్ళై లోకాచార్యుల తనియన్ను సేవిస్తూ పెట్టుకోవడము గమనించి సంతోషించి, అప్పడి నుండి తాను పిళ్ళై లోకాచార్యుల దగ్గర నేర్చుకొన్న ఙ్ఞానాన్ని క్రమము తప్పక తిరుమలై ఆళ్వారులకి ఉపదేశిస్తారు. ఒకసారి తిరుమలై ఆళ్వార్ పనిలో ఉండడము వలన ఆ రోజు పాఠానికి వెళ్ళలేకపోతారు. మర్నాడు నుండి దాసర్ కూడా పాఠం చెప్పుటకు వెళ్ళరు. అప్పుడు తిరుమలై ఆళ్వార్ దాసర్ దగ్గరకి వెళ్ళి అపరాద క్షమాపనమును కోరగా, దాసర్ క్షమించి వారికి తన శేష ప్రసాదాన్ని అనుగ్రస్తారు. అప్పడి నుండి తిరుమలై ఆళ్వార్ లౌకిక సంబంధాలను విడచి, తన రాజ భారాలను యువరాజుకు అప్పగించి రాజ్యమును వదిలి దాసరులతో తమ పూర్తి సమయమును గడిపారు.
కూర కులోత్తమ దాసులు తమ చివరి రోజుల్లో, తిరుమలై ఆళ్వారులను తిరుక్కణ్ణన్గుడి పిళ్ళై వద్దకి వెళ్ళి తిరువాయ్మొళి అర్థాలను, విళంచోలై పిళ్ళైల దగ్గర రహస్యార్థాలను నేర్చుకోవలసినదిగా ఆదేశిస్తారు. కూర కులోత్తమ దాసులను మన సంప్రదాయమునకు నాయకుడిగా తిరుమలై ఆళ్వారులను నియమించి పరమపదం చేరుకుంటారు. దాసులు పిళ్ళై లోకాచార్యులను ధ్యానిస్తు, తిరుమలై ఆళ్వారులకు చరమ కైంకర్యములను చాలా గొప్పగా నిర్వహిస్తారు.
తిరుమలై ఆళ్వార్ తిరుక్కణ్ణన్గుడి పిళ్ళై దగ్గరికి వెళ్ళి తిరువాయ్మొళి అర్థాలను అభ్యసించడం ప్రారంభిస్తారు. పిళ్ళై దాని సారమును మాత్రమే చెప్పుచుండగా, తిరుమలై ఆళ్వార్ ప్రతీ పదమునకు అర్థమును అడుగగా, పిళ్ళై తిరుప్పుట్కుళి జీయర్ దగ్గరకు వెళ్ళి అభ్యసించమని కోరారు. తిరుమలై ఆళ్వార్ తిరుప్పుట్కుళి చేరుకొనుటకు మునుపే జీయర్ పరమపదము చేరుకూంటారు. ఎంతో బాధతో వీరు దేవ పెరుమాళ్ళకు తమ మంగళాశాసనాలు సమర్పించుకోవాలని నిశ్చయించుకొని కంచికి చేరుకోగానే అక్కడి వాళ్ళు వీరిని సాదరముగా ఆహ్వానించి పెరుమాళ్ళ సన్నిధికి తీసుకొనివెళతారు. అక్కడ దేవ పెరుమాళ్ళు తమ శ్రీశఠగోపము, పూ మాల, శాత్తుపడి మొదలైన వాటిని ప్రసాదిస్తారు. అదే సమయములో నాలూర్ పిళ్ళై ఆ సన్నిదిలో ఉపస్థితులై ఉంటారు. (గమనిక: నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానమును ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళకి ఇచ్చిరి, వారు తమ కుమారులైన ఈయుణ్ణి పద్మనాభ పెరుమాళ్ళకి ఉపదేశించిరి. నాలూర్ పిళ్ళై ఈయుణ్ణి పద్మనాభ పెరుమాళ్ళకు శిశ్యులు, వారు ఈడు వ్యాఖ్యానమును పూర్తిగా తమ కుమారులైన నాలూర్ ఆచాన్ పిళ్ళైలకి ఉపదేశించిరి.) దేవ పెరుమాళ్ళు స్వయంగా నాలూర్ పిళ్ళైలతో సంభాషిస్తూ ఇలా అంటారు “ జ్యోతిష్కుడిలో నేను చెప్పిన విధముగా (పిళ్ళై లోకాచార్యుల వలె) మీరు తిరుమలై ఆళ్వారులకు అరుళిచ్చెయల్ అర్థాలను తిరువాయ్మొళి ఈడు వ్యాఖ్యానమును తిరుప్పుట్కుళి జీయర్ దగ్గర నేర్చుకోలేకపోవడము వలన పూర్తి చేయమని ఆఙ్ఞాపించిరి”. అది విని నాలూర్ పిళ్ళై తన అదృష్టముగా భావించుదునని, కాని తన వృద్దాప్యము కారణంగా తిరుమలై ఆళ్వారులకు సరిగా నేర్పలేనేమోనని అనిరి. అప్పుడు దేవ పెరుమాళ్ళు “మీ పుత్రుడు నాలూర్ ఆచ్చాన్ పిళ్ళై చెప్పిననూ సరే, మీరు చెప్పినట్టే అగును” అని అన్నారు. దైవాఙ్ఞను విని, నాలూర్ పిళ్ళై తిరుమలై ఆళ్వారులను స్వీకరించి ఎంతో సంతోశముతో నాలూర్ ఆచ్చాన్ పిళ్ళై వద్దకు తీసుకుపోయి ఈడుతో పాటు ఇతర అరుళిచ్చెయల్ అర్థాలను ఉపదేశించమని వారిని ఆఙ్ఞాపించిరి.
నాలూర్ ఆచ్చాన్ పిళ్ళై (దేవరాజర్ అనికూడా వ్యవహరించుదురు) అర్థాలను ఉపదేశించడము ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలుసుకొని తిరునారాయణపురత్తు ఆయి, తిరునారాయణపురత్తు పిళ్ళైతో పాటు కొందరు నాలూర్ ఆచ్చాన్ పిళ్ళైని, తిరుమలై ఆళ్వారులను తాము వివరముగా నేర్చుకొనుటకు అవకాశము ఉండునని తిరునారాయణపురానికి వచ్చి అక్కడ కాలక్షేపాన్ని సాయించమని అభ్యర్తించారు. వారి అభ్యర్తనని మన్నించి తిరునారాయణ పురానికి వెళ్ళి, ఎంపెరుమానార్లు, యదుగిరి నాచ్చియార్, శెల్వ పిళ్ళై, తిరునారాయణులకు మంగళాశాసనాలు చేసి పూర్తి కాలక్షేపాన్ని అక్కడే సాయించారు. తిరుమలై ఆళ్వార్ ఈడును పూర్తిగా అక్కడే నేర్చుకొని వారి సేవల ద్వారా ఆచార్యులను సంతోష పరిచిరి, నాలూర్ ఆచ్చాన్ పిళ్ళై తమ తిరువారాధన పెరుమాళ్ళని (ఇనవాయర్ తలైవన్) తిరుమలై ఆళ్వారులకు ప్రసాదిస్తారు. ఆ విధముగా ఈడు 36000 పడి నాలూర్ ఆచ్చాన్ పిళ్ళై ద్వారా ముగ్గురు గొప్ప విద్వానులకు వచ్చి చేరింది – తిరుమలై ఆళ్వార్, తిరునారాయనపురత్తు ఆయి, తిరునారాయనపురత్తు పిళ్ళై.
తిరుమలై ఆళ్వార్ ఆళ్వార్ తిరునగరికి తిరిగి వెళ్ళి అక్కడే ఉండాలని నిర్ణయించుకొన్నారు. నమ్మాళ్వార్లు విడచి పెట్టినప్పటి నుండి ఆళ్వార్తిరునగరిని అంతయూ ఒక వనంలా మారింది. ఆళ్వార్తిరునగరిని చేరిన వెంటనే అక్కడ ఉన్న కలుపు మొక్కాలను, పొదలను తొలగించి మరల ఒక సుందరమైన ఆళ్వార్తిరునగరిగా రూపొందించిన కారణము వలన వీరు ‘కాడు వెట్టి గురు’ అనే బిరుదును పొందారు (కారణము అడవిని శుభ్రమును చేసిన ఆచార్యులు). వారు నమ్మాళ్వార్లను తిరుక్క నంబి (కేరళలోని) నుండి తిరిగి ఆళ్వార్తిరునగరికి తెచ్చి గుడిని మరలా నెలకొలిపి ఆరాధించారు. వీరు ఎంపెరుమానార్లకు (భవిష్యదాచార్యుల తిరుమేని (నమ్మాళ్వార్లు అందించిన విగ్రహం)) ఆళ్వార్తిరునగరి దక్షిణాన ఆలయాన్ని నిర్మించి, చతుర్వేది మంగలమును (4 వీధులు గుడి చుట్టూ), 10 కుటుంబాలను ఏర్పరిచి, గుడిలో కైంకర్యాలకు సహాయంగా ఒక శ్రీవైష్ణవ అమ్మైయారును (విధవ) ఉంచారు. వీరు నమ్మాళ్వార్ల కీర్తిని పాడటం వలన, తిరువాయ్మొళిని ఉపదేశించడము వలన తిరువాయ్మొళి పిళ్ళైగా వ్యవహరింపబడ్డారు.
కొంతకాలము తరువాత, తిరువాయ్మొళి పిళ్ళై తిరువనంతపురమునకు వెళ్ళి అక్కడ పిళ్ళై లోకాచార్యుల ముఖ్య శిశ్యుడు విళాంచోలై పిళ్ళైని కలసి రహస్య గ్రంథాలను అభ్యసించాలనుకున్నారు. విళాంచోలై పిళ్ళై ఎప్పుడూ వారి ఆచార్యులను ధ్యానిస్తూ ఉండేవారు. ఎంతో సంతోషముతో తిరువాయ్మొళి పిళ్ళైని ఆహ్వానించి, లోతైన అర్థములను వారికి ఉపదేశించి, సంపూర్ణముగా వారిని ఆశీర్వదించారు. ఆ తరువాత తిరువాయ్మొళి పిళ్ళై ఆళ్వార్ తిరునగరికి తిరిగి చేరుకుంటారు. ఆ తరువాత విళాంచోలై పిళ్ళై తమ చరమ తిరుమేనిని వదిలి నిత్య విభూతిలో ఆచార్యులకు నిత్య కైంకర్యం చేయుటకు పరమపదానికి చేరుకుంటారు. అది విని, తిరువాయ్మొళి పిళ్ళై వారికి చరమ కైంకర్యములను నిర్వహించారు.
కొంతకాలము తరువాత పెరియ పెరుమాళ్ళు జీవాత్మాలను ఈ సంసారము నుండి పరమపదానికి చేర్చుటకు ఆదిశేషులని మరలా అవతరించమని ఆజ్ఞాపించారు. తిరువనంతాళ్వాన్ తమ స్వామి ఆఙ్ఞను శిరసావహిస్తూ అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ (అళగియ మణవాళ మామునులు) తిగళ కిడంతాన్ తిరునావీరుడయ పిరాన్ (గోమడతాళ్వాన్ పరంపర, ఎమ్పెరుమానార్ ఎర్పరచిన 74 సింహాసనాధి పతులలో ఒక వంశము), శ్రీరంగ నాచ్చియార్లకు ఐప్పసి తిరుమూలము నందు ఆళ్వార్తిరునగరిలో జన్మించారు. వారు కొంత కాలము వారి అమ్మమ్మ గారి ఊరైన శిక్కిల్ కిడారంలో పెరిగి సామాన్య శాస్త్రము, వేదాధ్యాయనమును వారి తండ్రి వద్ద అభ్యసించారు. తిరువాయ్మొళి పిళ్ళై గురించి విని, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ ఆళ్వార్తిరునగరికి తిరిగి వచ్చి, వారికి శిశ్యులుగా మారి, వారికి చేస్తూ వారి దగ్గర అరుళిచ్చెయల్ అర్థాలను మొత్తము నేర్చుకొన్నారు. తిరువాయ్మొళి పిళ్ళై మార్గనిర్దేశంలో, భవిష్యదాచార్యులకు అత్యంత ప్రేమ భక్తితో తిరువారాధనమును చేస్తూ ఎమ్పెరుమానార్ల కీర్తి విషయమై యతిరాజ వింశతిని రచించారు. కొందరు తిరువాయ్మొళి పిళ్ళై శిష్యులు ఎందుకు తమ ఆచార్యులైన అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లతో ఎంత భక్తితో ఉంటారని ఆశ్చర్యపోతుండగా, తిరువాయ్మొళి పిళ్ళై అది గ్రహించి, ఆదిశేషులే ఈ విధముగా అవతరించారని వారికి వివరిస్తారు.
తిరువాయ్మొళి పిళ్ళై తమ ఆఖరి రోజులలో, మన సంప్రదాయమునకు తన తరువాత ఎవరు ఉత్తరాధికారి అని చింతిస్తున్నారు. ఆ సమయములో, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు తానే బాధ్యతలను నిర్వహిస్తానని, వారి కోరికలను నెరవేస్తానని వాగ్దానము చేస్తారు. అది విని ఎంతో సంతోషించి, తిరువాయ్మొళి పిళ్ళై వారిని శ్రీభాష్యమును నేర్చుకోమని, కాని తిరువాయ్మొళి వ్యాఖ్యానములపై నిత్య ధ్యానం చేయమని, తక్కిన జీవితమును శ్రీరంగ పెరియ పెరుమాళ్ళకు మంగళాశాసనమును చేయుచూ గడపమని ఆఙ్ఞాపించారు. తిరువాయ్మొళి పిళ్ళై తన ఇతర శిశ్యులకు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లను ప్రత్యేక అవతారముగా గుర్తించి వారితో ఎంతో గౌరవ మర్యాదలతో వ్యవహరించమని నిర్దేశించారు. ఆ తరువాత, పిళ్ళై లోకాచార్యుల తిరువడిని ధ్యానించి, తిరువాయ్మొళి పిళ్ళై తమ చరమ తిరుమేనిని వదిలి పరమపదమును చేరుకున్నారు. అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ ఇతర శిష్యులతో కలిసి వారికి చరమ కైంకర్యమును గొప్పగా జరిపించారు.
ఎమ్పెరుమానార్లు ఏవిధముగా పెరియ నంబి (పరాంకుశ దాసర్) వద్ద ఆదరువు పొందిరో, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు తిరువాయ్మొళి పిళ్ళై (శఠగోప దాసర్) వద్ద ఆదరువును పొందిరి. వారి కృషి వలన మనము ఆళ్వార్తిరునగరిని, ఆతినాథ ఆళ్వార్ సన్నిధిని, భవిష్యదాచార్యులు (ఎమ్పెరుమానార్) సన్నిధిని ప్రస్తుత రూపములో చూస్తున్నాము. వారు తమ జీవితమును పూర్తిగా నమ్మాళ్వార్లకు, తిరువాయ్మొళి కి అర్పించారు. పిళ్ళై లోకాచార్యుల ఆఙ్ఞగా ఎన్నో ప్రదేశములకు వెళ్ళి అనేక ఆచార్యుల ఉపదేశాలను సేకరించిరి చివరగా వాటిని భవిషత్తులో అళగియ మణవాళ మామునిగా మారబోతున్న అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లకు సమర్పించారు. తిరువాయ్మొళి పిళ్ళై కృషి వలన మనము ఈడు 36000 పడి వ్యాఖ్యానమును పొందాము, తదుపరి అళగియ మణవాళ మామునులచే ఎంతో ఎత్తునకు చేరినది.
ఎమ్పెరుమానార్లతో మన ఆచార్యులతో మనకూ అలాంటి అనుబంధమూ కలిగేలా తిరువాయ్మొళి పిళ్ళైల శ్రీచరణములను ప్రార్థిద్దాము .
తిరువాయ్మొళి పిళ్ళైల తనియన్ :
నమ శ్రీశైల నాథాయ కుంతీ నగర జన్మనే ।
ప్రసాదలబ్ద పరమ ప్రాప్య కైంకర్యశాలినే ॥
మన తదుపరి సంచికలో అళగియ మణవాళ మామునుల వైభవమును చూద్దాము.
రఘు వంశీ రామానుజ దాసన్
మూలము: https://guruparamparai.koyil.org/2012/09/19/thiruvaimozhi-pillai/
పొందుపరిచిన స్థానము – https://guruparamparai.koyil.org/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org
10 thoughts on “తిరువాయ్మొళి పిళ్ళై”