శ్రీః
శ్రీమతేరామానుజాయనమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మునయే నమః
తిరునక్షత్రం : కార్తీక మాస కృత్తికా నక్షత్రం
అవతార స్థలం : తిరుక్కురయలూర్
ఆచార్యులు : విశ్వక్సేనులు, తిరునరయూర్ నంబి, తిరుకణ్ణపురం శౌరిరాజ పెరుమాళ్
శిష్య గణం: తమ బావమరిది ఇళయాళ్వార్, పరకాల శిష్యులు, నీర్మేళ్ నడప్పాన్ (నీటి పైన నడిచే వాడు), తాళూదువాన్ (తాలములను నోటితో ఊది తెరిచేవాడు), తోళావళక్కన్ (జగడములు చేసి ధనమును రాబట్టే వాడు), నిలలిళ్ ఒదుంగువాన్ (నీడలో ఒదిగి పోయేవాడు), నిజలిళ్ మరైవాన్, ఉయరత్ తొంగువాన్ (ఎంత ఎత్తుకైన ఎక్కేవాడు)
రచనలు/కృతులు: పెరియ తిరుమొళి, తిరుక్కురుదాణ్డగం, తిరువెళుకూత్తిరుకై, శిరియ తిరుమడళ్, పెరియతిరుమడళ్, తిరునెడుదాణ్డగం.
తిరునాడలకరించిన దివ్యదేశం: తిరుకురుఙ్గుడి
పెరియ వాచ్చాన్ పిళ్ళై శాస్త్ర సారమగు తమ పెరియ తిరుమొళి అవతారికలో, తిరుమంగై ఆళ్వార్కి ఇలా అనుగ్రహించినారు. ఎంపెరుమాన్ (భగవంతుడు) తన నిర్హేతుక కృప వలన ఆళ్వార్ని సంస్కరిచినారు మరియు అతని ద్వారా అనేక జీవాత్మలు కూడా ఉద్ధరించ బడినాయి. దానిని పరిశీలిద్దాము.
తిరుమంగై ఆళ్వార్ తమ ఆత్మను (తమను తాము) మండే సూర్యుని యందు మరియు తమ దేహాన్ని మాత్రము చల్లని నీడలో ఉంచినారు. దీనంతరార్థము మండే సూర్యుని యందుంచుట అనగా భగవద్విషయము లందు (ఆధ్యాత్మిక విషయములందు) లగ్నము కాకపోవడం, తమ దేహాన్ని మాత్రము చల్లని నీడలో ఉంచినారనగా అనాదిగా భౌతిక విషయములందు కోరికలు కలిగి అదే తమ జీవిత లక్ష్యం అని అనుకొన్నారు. నిజమైన ఛాయ (నీడ) భగవద్విశయము కావుననే ‘వాసుదేవ తరుచ్ఛాయ’ దీనర్థం వాసుదేవుడు (శ్రీకృష్ణభగవానుడు) నిజమైన ఛాయ అనుగ్రహించే వృక్షం. తానే నిజమైన చల్లని ఛాయ అనుగ్రహించు వృక్షం, ఈ చల్లని ఛాయ మనలను సదా సర్వ దేశ సర్వ కాలము నందు రక్షించునది, మన తాపమును ఉపశమింప చేయునది మరియు ఇది అతి శీతలమైనది కాదు అతి వేడియైనది కాదు. తిరుమంగై ఆళ్వార్ ఏవైతే భౌతిక సుఖాన్ని అందిస్తాయో ఆ విషయాంతరముల యందు (భౌతిక కోరికలు) బహు ఆసక్తిని కలిగి ఉండెడివారు. కాని ఎంపెరుమాన్ తిరుమంగై ఆళ్వార్ని విషయాంతరముల నుండి దివ్య దేశములలో వేచేంసి ఉన్న తమ అర్చావతార వైభవమును ప్రదర్శించగా ఆళ్వార్ ఆ అర్చావతార వైభవమును తమ హృదయము నిండా ఆనందంగా అనుభవించి ఆరూపమును వదలి క్షణకాలమైనను ఉండ లేక విరహమును అనుభవించిరి. తర్వాత ఎంపెరుమాన్ ఆళ్వార్ ని ఈ భౌతిక సంసారములో ఉన్నను నిత్య ముక్తుల అనుభవ స్థాయికి తీసుకెళ్ళి పరమపదమును అనుభవించేలా చేసి చివరకు పరమపదమును అనుగ్రహించిరి.
ఆళ్వార్ భగవంతుడు తమ అద్వేషత్వం పరిశీలిస్తున్నారని భావించారు (భగవంతుడు ఈ జీవాత్మను అనాదిగా సర్వవేళల యందు రక్షించుటకు ప్రయత్నించగా జీవుడు దానిని తిరస్కరిస్తుంటాడు. ఎప్పుడైతే ఈ జీవుడు తిరస్కరించకుండా ఉంటాడో ఆ స్థితి చాలు భగవానునికి వీడిని ఉద్ధరించడానికి – అధికారి విశేషణములో జీవుని ఈ సహజ స్వభావాన్ని అద్వేషం అంటారు.) భౌతికవిషయాల పరిమితులను సంస్కరించాలని, ఆళ్వార్ యొక్క భౌతికవిషయముల యందు ఆసక్తిని ఆసరాగా (భగవంతుని వైపు ఆసక్తి కలిగేలా), ఆళ్వార్కి అనాదిగా వస్తున్న పాపములను తమ కృపతో తొలగించడమే లక్ష్యంగా ఎంపెరుమాన్ ప్రథమంగా తిరు మంత్రాన్ని ఉపదేశించారు మరియు తమ స్వరూప (నిజ స్వభావం) రూప (అవతారములు) గుణ (దివ్య లక్షణములు) మరియు విభూతి (నాయకత్వ సంపద) లను దర్శింపచేశారు. ఆళ్వార్ భగవంతుని కృపకు పాత్రుడైనప్పుడు అతనికి కృతఙ్ఞతగా తమ పెరియ తిరుమొళిలో తిరుమంత్రాన్ని కీర్తించసాగిరి. ఇది చిత్ (ఙ్ఞానము కల) యొక్క స్వరూమైన ఙ్ఞానోదయం, జడత్వం తొలగిన ఙ్ఞానం కాని వాటిని అభినందించడం మాత్రము కాదు. ఆళ్వార్ దీనికి తమ కృతఙ్ఞతను ప్రదర్శిస్తూ అర్చవతార వైభవాన్ని కీర్తించిరి చాలా ప్రబంధములలో.
పెరియ వాచ్చాన్ పిళ్ళై ఎంపెరుమాన్ నిర్హేతుక కృప (కారణ రహిత కృప) ను ఆళ్వార్ యొక్క ఉపాయ శూన్యత్వం (ఎంపెరుమాన్ దయ పొందుటకు అనుకూల చర్యా ప్రదర్శన లోపించుట) ను తమ వ్యాఖ్యాన అవతారికలో స్థాపించారు. కాని ఆళ్వార్ ఎప్పుడైతే ఎంపెరుమాన్ దివ్య కృపచే అనుగ్రహింపబడినారో ఈ ఎంపెరుమాన్ ప్రతిగా ఈ సంబంధము అసమానమైనదని తమ పెరియ తిరుమొళి 4..9.6 యందు “నుమ్మఅడియారోడుమ్ ఒక్క ఎన్నానియిరుత్తిర్ అడియేనై“ నన్ను ఇతర దాసుల వలె పరిగణించరాదు.
మనం ఇప్పటికే ఆళ్వార్ యొక్క స్తుతిని పెరియ వాచ్చాన్ పిళ్ళై మరియు మామునుల ఎలా వర్ణించారో http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-thirumangai.html. నందు చాశాము.
తిరువరంత్త అముదనార్ తమ రామానుజ నూత్తందాది 2వ పాశురంలో ఎంపెరుమానార్ (శ్రీ రామానుజులు) ను “కురయళ్ పిరాన్ అడిక్కీళ్ విల్లాద అన్బన్” గా ప్రకటించిరి. దీనర్థం – ఎవరైతే (శ్రీరామానుజులు) తిరుమంగై ఆళ్వార్ తిరువడితో వెనుదీయని సంబంధము కలవారో.
మాముణులు తిరువాలి – తిరునగరి దివ్య దేశమును సందర్శించి నప్పుడు ఆళ్వార్ దివ్య తిరుమేని సౌందర్యము నందు (రూప సౌందర్యము) ఈడుపడి ఒక పాశురాన్ని ఆశువుగా అనుగ్రహించినారు. ఆ పాశురం ఆళ్వార్ దివ్యత్వమును కళ్ళముందుం చుతుంది. దానిని మనం ఇప్పుడు అనుభవిద్దాం.
అనైతధ వేలుం, తొళుకైయుం అళుంతియ తిరునామముం
ఒమెన్ఱ వాయుం ఉయరంద ముఖం, కుళిరింద ముఖముం
పరంద విషుయుం , ఇరుంద కుశలుం చురంద వళైయముం
వడిత్త కాతుం, మలరంద కాత్తు కాప్పుం, తళంద చెవియుం.
చెరింద కళుత్తతుం అగన్ఱ మార్బుం తిరంద తోలుం
నెళితధ ముత్తుగుం కువింద ఇడైయుం అల్లిక్కయిరుం
అళుందియ చ్లరావుం, తుక్కైయ కరుంగకోవైయుం
తొంగగలుం, తని మాలైయుం చత్తతియ తిరుత్తన్నాడైయుం
చతిరాన వలర్కజలుం కుంతియిట్ట కన్నైక్కాలు
కుళిర వైత్త తిరువాడి మలరుం, మరువలర్తం ఉడళ్ తునియ
వాళ్ విశుం పరకాలన్ మంగైమన్నారాన వడివే ఎన్ఱుం
పరకాలులు / మంగైమన్నన్ (మంగై అనే ప్రదేశానికి రాజు) దివ్య రూపము సదా నామనస్సులో నిలుపుకుంటాను. ఈ రూపమును ఇలా వ్యాఖ్యానించారు – బల్లెమునకు ఆధారమైన ఆ దివ్య భుజములు, ఎంపెరుమానుని ఆరాధిస్తున్న ఆ శ్రీ హస్తములు, దివ్య ఊర్ధ్వ పుండ్రములు, ప్రణవాన్ని ఉచ్ఛరిస్తున్న ఆ నోరు, కొద్దిగా ఎత్తై మొనదేలిన నాసికాగ్రం, ప్రశాంత వదనం, విశాల నేత్రములు, వంపులు తిరిగిన నల్లని కురులు, కొద్దిగా ముందుకు వంగి (ఎంపెరుమాన్ వద్ద తిరు మంత్రము శ్రవణం చేయడానికి) తీర్చిదిద్దిన కర్ణములు, గుండ్రని అందమైన మెడ, విశాల వక్షస్థలం, బలమైన బాహుద్వయం, అందంగా తీర్చిన వీపు పైభాగం, సన్నని కటిభాగం, అందమైన పూమాల, అద్భుతమైన అందెలు, వినయాన్ని ప్రదర్శిస్తున్ననట్లుగా వంగిన మొకాళ్ళు, కొద్దిగా వ్యత్యాసంగా ఉన్న పాదారవిందములు, శత్రువులను సంహరించు ఖడ్గం, తిరువాలి తిరునగరిలో వేంచేసి ఉన్న ఈ కలియన్ అర్చామూర్తి మొత్తం సృష్ఠిలోని విగ్రహములో కెల్ల అందమైనదని మనం సులువుగా నిర్ధారణ చేయవచ్చు.
ఆళ్వార్ ఈ తిరునామాలతో కూడా పరిగణింప బడేవారు, పరకాలన్ (ఇతర మతస్థులకు కాలుల (యముని) వంటివారు), కలియన్ (కాలుల వంటివారు), నీలుడు (నీలవర్ణ దేహచ్ఛాయ కలవారు), కలిధ్వంసులు (కలిని నశింప చేయువారు), కవిలోక దివాకరులు (కవి లోకానికి సూర్యుల వంటివారు), చతుష్కవి శిఖామణి (నాలుగు రకాల కవిత్వంలో ఆరితేరినవారు), శట్ ప్రబంధ కవి (ఆరు ప్రబంధములను కృప చేసిన కవి), నాలుకవి పెరుమాళ్, తిరువాల్వురుడయ పెరుమాన్ (గొప్ప కత్తి గల ఉపకారకులు), మంగైయార్ కోన్ (మంగై దేశానికి రాజు), అరుళ్మారి (వర్షాకాలపు వర్షంలాగా కృపను వర్షించేవారు), మంగైవేందన్ (మంగదేశానికి అధికారులు), ఆళినాడన్ (ఆడళ్ మా అను పేరుగల గుర్రానికి అధికారి), అరట్టముఖి, అడయార్ శియం (పరమతస్తులను దగ్గరకు రానివ్వని సింహం), కొంగు మాలార్క్ కుజలియర్ వేళ్, కొర్చ వేందన్ (గొప్పరాజు), కొరవిళ్ మంగై వేందన్ (ఏ కొరతాలేని మంగైరాజు).
వీటిని మనస్సులో నిలుపుకొని ఆళ్వార్ చరితమును తెలుసుకుందాము.
ఆళ్వార్ కార్ముఖ (కుముద గణము) అంశావతారంగా తిరుక్కురయలూర్ లో (తిరువాలి – తిరునగరి సమీపాన) చతుర్థ వర్ణమున నీలుడు (నల్లని దేహచ్ఛాయ కలిగిన) అనే నామధేయంతో అవతరించిరి అని గరుడ వాహ పండితుని దివ్యసూరి చరితమున కలదు.
వీరి బాల్యమంతా భగవద్విషయ సంబంధము లేకుండానే గడిచి పోయినది. కాల క్రమేణ పెరిగి యువకుడయ్యాడు. కాని భౌతిక విషయాల యందు ఆసక్తి కలవాడయ్యాడు. శరీరమును బాగా బలిష్ఠంగా పెంచాడు. కుస్తీలో మెలుకువలు బాగా నేర్చాడు. ఏదైన ఆయుధాన్ని ప్రయోగించగల సామర్థ్యాన్ని సంపాదించి చోళ రాజు వద్దకు వెళ్ళి తన సామర్థ్యానికి అనుగుణంగా సైన్యంలో భాగత్వం ఇవ్వాలని అడిగాడు. చోళరాజు నీలుని సామర్థ్యానికి అనుగుణంగా సైన్యాదక్ష్యుడిగా నియమించి పాలించడానికి ఒక ప్రాంతాన్ని ఇచ్చాడు.
ఒకానొక సమయాన తిరువాలి దివ్య దేశమున ఉన్న అందమైన సరోవరంలో అప్సరస స్త్రీలు (దేవ లోక నాట్యగత్తెలు) జలకాలాడటానికి దిగారు. వారిలో తిరుమామగళ్ (కుముదవల్లి) అనే కన్య పుష్ప సంచయనానికి వెళ్ళగా తన స్నేహితురాళ్ళు ఈ కన్యను మరచి వెళ్ళి పోయారు. తాను మనుష్యకన్యగా మారి సహాయార్థం ఎదురు చూడసాగింది. ఆ సమయాన ఆ మార్గాన ఒక శ్రీవైష్ణవ వైద్యుడు వెళ్ళుతు ఈ అమ్మాయిని చూసి వివరములడుగగా తనను తన స్నేహితులు వదిలి వెళ్ళిన వృత్తాంతమును వివరించినది. ఆ వైద్యుడు సంతానహీనుడు కావున ఈ అమ్మాయిని సంతోషంగా తీసుకొని తన గృహమున కెళ్ళి తన భార్యకు పరిచయం చేశాడు. దీనికి అతని భార్య సంతసించి ఆ అమ్మాయిని తమ కూతురిలా పెంచసాగిరి. ఆ అమ్మాయి అందాన్ని చూసిన వారు ఆ అమ్మాయి గురించి నీలునికి వివరించారు. నీలుడు ఆమె అందానికి ముగ్ధుడై ఒకసారి ఆ భాగవత వైద్యుని దగ్గరకు వెళ్ళి మాటాలాడాడు.
ఆ సమయాన కుముద వల్లి విషయాన ఆ వైద్యుడు నీలునితో ఈ అమ్మాయి వివాహము గూర్చి చెబుతూ ఆమె యొక్క కుల గోత్రములు తెలియవని వివరిస్తాడు. నీలుడు ఆ అమ్మాయిని వివాహమాడుతానని చాలా సంపదలను కూడా ఇస్తానని చెబుతాడు. ఆ వైద్య దంపతులు సంతోషముగా ఒప్పుకున్నారు. కాని కుముద వల్లి ఒక షరతుని విధించినది ఏమనగా తాను కేవలం ఆచార్యుని వద్ద సమాశ్రయణం (పంచ సంస్కారములు) పొందిన శ్రీవైష్ణవుణ్ణే వివాహమాడుతానని . తెలివైనవాడు విశేషమైన దానిని పొందడానికి శీఘ్రముగా కార్యమును చేస్తాడు. అలాగే నీలుడు వెంటనే తిరునరయూర్ పరుగెత్తి తిరునరయూర్ నంబి దగ్గర వెళ్ళి పంచ సంస్కారములు అనుగ్రహించమని ప్రార్థిస్తాడు. ఎంపెరుమాన్ దివ్య కృపతో శంఖ చక్ర లాంఛనములతో అనుగ్రహించి, తిరుమంత్రాన్నిఉపదేశిస్తాడు.
పద్మ పురాణమున ఇలా చెప్పబడింది.
సర్వైశ్చ శ్వేతమృత్యా ధార్యం ఊర్థ్వపుండ్రం యధావిధి
ఋజుణి సాంతరాలాణి అంగేషు ద్వాదశస్వపి
ఊర్ద్వ పుండ్రములను తప్పని సరిగా శరీరంలోని ద్వాదశ స్థలములలో ఊర్ద్వ దిశలో తగిన స్థల వ్యత్యాసముతో దివ్య దేశములలో లభించు శ్వేతమృత్తికతో ధరించ వలెను.
పిమ్మట ఆళ్వార్ ద్వాదశ పుండ్రములను ధరించి కుముద వల్లి తాయార్ దగ్గరకు వచ్చి వివాహమాడమని కోరతాడు. దీనికి ఒప్పుకొని కుముదవల్లి, వివాహమాడతాను కాని మీరు ఒక సంవత్సరం పాటు ప్రతి రోజు విఫలం కాకుండా 1008 మంది శ్రీవైష్ణవులకు తదీయారాధన కైంకర్యము చేయవలసి ఉండును అప్పుడే తమని భర్తగా అంగీకరిస్తానని షరతుని విధిస్తుంది. ఆమెపైన గల అనురాగముతో ఆళ్వార్ షరతుకు అంగీకరించి కుముదవల్లిని అతి వైభవముగా వివాహమాడతాడు.
పద్మ పురాణములో ఇలా చెప్పబడినది:
ఆరాధనానాం సర్వేషాం విష్ణోః ఆరాధనం పరం|
తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారధనం నృప||
ఓ రాజా! ఇతర దేవతల కన్న శ్రీ మహా విష్ణువుని ఆరాధించడం చాలా విశేషము. కాని ఆయన కంటే ఆయన భక్తులను ఆరాధించుట బహు విశేషము.
ఈ ప్రమాణాన్ని అనుసరించి ఆళ్వార్ తన సంపదలన్నింటిని వినియోగిస్తు తదీయారాధనను (విశేషమైన దివ్య ప్రసాదాన్ని శ్రీవైష్ణవులకు భోజనంగా అందించడం) ప్రారంభించారు. దీనిని చూసిన కొందరు ఈ నీలుడు (పరకాలుడు) ప్రజాధనానంతటిని శ్రీవైష్ణవుల తదీయారాధనకు వినియోగిస్తున్నాడని మహారాజుకు ఫిర్యాదు చేశారు. ఆ రాజు పరకాలులను తీసుకరమ్మని తన సైన్యమును పంపగా పరకాలులు కొంత ప్రతీక్షించ వలసినదని నివేదించాడు. వారు ఆళ్వార్ను రాజుకు కప్పం (సుంకం) కట్ట వలసినదని నిర్భందిస్తారు. ఆళ్వార్ కోపగించుకొని వారిని బయటకు నెట్టివేస్తాడు. ఆ సైన్యం తిరిగి వెళ్ళి రాజుకు జరిగినదంతా నివేదిస్తారు. రాజు సైన్యాదక్షునికి మొత్తం సైన్యమును తీసుకొని పరకాలులను బంధించమని ఆఙ్ఞాపిస్తాడు. ఆ సైన్యాదక్షుడు పెద్దమొత్తంలో సైన్యమును తీసుకొని పరకాలునిపై దండెత్తాడు. ఆళ్వార్ వారిపై ధైర్యంగా శక్తి యుక్తంగా ఎదిరిస్తూ ఆ సైన్యాదక్షునికి మరియు మొత్తం సైన్యమును వెనుదిరిగేలా చేస్తారు. ఆ సైన్యాదక్షుడు రాజు వద్దకు వెళ్ళి ఆళ్వార్ విజయ ప్రాప్తిని తెలుపుతాడు. ఆ రాజు తానే స్వయంగా పోరు సల్పదలచి తన మొత్తం సైన్యముతో ఆళ్వార్పైకి దండెత్తారు. ఆళ్వార్ సాహసాన్ని ప్రదర్శించి ఆ సైన్యాన్ని అతి సులువుగా నాశనం చేస్తాడు. ఆ రాజు ఆళ్వార్ ధైర్యానికి సంతసించి శాంతిని ప్రకటించగా ఆళ్వార్ దానిని నమ్మి ముందుకురాగా కుయుక్తితో రాజు తన మంత్రితో బంధించి తన బకాయి కప్పమును కట్టమని నిర్భంధిస్తారు. ఆళ్వార్ని ఎంపెరుమాన్ సన్నిధి దగ్గర చరసాలలో బంధిస్తారు. దీనికి ఆళ్వార్ మూడు రోజులు పస్తులుంటారు. ఆ సమయాన తిరునరయూర్ నాచ్చియార్ తన తిరునరయూర్ నంబితో ఆకలితో ఉన్నాడు కావున ప్రసాదం తీసుకెళుతానని చెబుతుంది. ఆళ్వార్ పెరియ పెరుమాళ్ (శ్రీరంగనాథుడు) మరియు తిరువేంగడముడయాన్ (శ్రీనివాసుడు) ల ధ్యానములో మునిగిపోయారు. కాంచీ వరదుడైన దేవపెరుమాళ్ ఆళ్వార్కి స్వప్నమున సాక్షాత్కరించి కాంచీపురమున పెద్ద నిధి ఉందని మీరు వస్తే ఇస్తానని చెబుతాడు. ఆళ్వార్ ఈ స్వప్న వృత్తాంతాన్ని రాజుకు నివేదించగా రాజు పెద్ద రక్షణతో తనను కాంచీపురానికి పంపుతాడు. ఆళ్వార్ కాంచీపురానికి చేరుకొనగా అక్కడ నిధి కనిపించలేదు. తన భక్తులకు సర్వం అనుగ్రహించే ఆ దేవపెరుమాళ్ మళ్ళీ ఆళ్వార్ స్వప్నమున సాక్షాత్కరించి వేగవతీ నదీ తీరాన ఆ నిధి ఉన్న స్థలమును చూపిస్తాడు. ఆళ్వార్ ఆ నిధిని సేకరించి రాజుకు కట్ట వలసిన కప్పమును కట్టి మిగితాది తదీయారధన కొనసాగించుటకు తిరుక్కురయలూర్ కు మళ్ళిస్తారు.
మళ్ళీ ఆ రాజు కప్పమును కట్టమని తన సైన్యమును పంపగా ఆళ్వార్ కలత చెందగా మరలా దేవ పెరుమాళ్ స్వప్నమున సాక్షాత్కరించి వేగవతీ నదీ తీరాన ఉన్న ఇసుకను సేకరించి ఆ సైన్యమునకు ఇవ్వ వలసినదని ఆఙ్ఞాపిస్తారు. ఆళ్వార్ ఆ సైన్యమునకు ఇసుకను ఇవ్వగా వారికి ఆ రేణువులు విలువైన ధాన్యంగా కనిపిస్తాయి. వారు ఆనందంగా రాజువద్దకు వెళ్ళి జరిగినదంతా వివరిస్తారు. అప్పుడు ఆ రాజు ఆళ్వార్ యొక్క గొప్పదనాన్ని గుర్తిస్తాడు. తన రాజ్యసభకు ఆహ్వానించి తన తప్పుకు క్షమాప్రార్థన చేసి తిరిగి సంపదనంతా ఇచ్చి వేస్తాడు. తాను చేసిన నేరాలకు ప్రాయశ్చిత్తంగా తన సంపదను దేవస్థానములకు మరియు బ్రాహ్మణులకు పంచివేస్తాడు. ఆళ్వార్ తమ తదీయారధనను నిరంతరంగా నడిపిస్తున్నారు. అలాగే తన సంపద కూడా తరుగుతూ రాగాసాగింది. తాను మాత్రం ఈ తదీయారాధనను ధనవంతుల నుండి దారిదోపిడిని చేసైనా సరే నిరంతరం జరపాలని నిశ్చయించినారు.
ఆళ్వార్ పిసినారి ధనవంతుల నుండి ధన్నాన్నిసేకరించి నిర్విరామంగా తదీయారాధనను జరిపిస్తున్నారు. సర్వేశ్వరుడు ఇలా చింతించసాగాడు. ఇతను దొంగతనము చేస్తున్నాడు. అయిననూ ఆ సొమ్ముచే శ్రీవైష్ణవులకు తదీయారాధనను చేస్తున్నాడు కదా ఇది సరైనదే. ఇది చరమ పర్వనిష్ఠ (చరమోపాయం), భగవంతుడు ఆళ్వార్ని సంసారసాగరం నుండి తన నిర్దోష దయాగుణంచే ఉద్ధరించాడు. శ్రీమన్నారాయణుడు నరునిగా (ఆచార్యునిగా) అవతరించి శాస్త్రానుగుణంగా సంసారాన్ని అనుభవిస్తున్న జీవాత్మను ఉద్ధరిస్తాడో ఆ మాదిరిగా ఎంపెరుమాన్ తన దేవేరితో ఆళ్వార్ని అనుగ్రహించుటకు అతనుండే చోటుకు వివాహ వస్త్రములు, అందమైన నగలు ధరించి వివాహ బృందముతో వయలాలి మణవాళన్ గా బయలుదేరుతాడు. అధిక మొత్తంలో దోచు కోవడానికి అవకాశం లభించి నందున ఆళ్వార్ ఆనందపడి వయలాలి మణవాళన్ తో సహా ఆ వివాహ బృందాన్ని సమస్తం దోచుకోవడానికి ఆక్రమించారు. ఆళ్వార్ అలా దోచుకొని చివరకు కాలి మెట్టెను తన నోరు ద్వారా తీయ దలచి ఎంపెరుమాన్ దివ్యా పాదారవిందములను కొరికాడు. ఆళ్వార్ ఈ శౌర్యమునకు ఎంపెరుమాన్ ఆశ్చర్య చకితుడై “నం కలియన్” అని సంభోదిస్తాడు. దీనర్థం మీరు నా కలియనా ? (శౌర్యములో ఆధిక్యులు)
తర్వాత ఆళ్వార్ మొత్తం సంపదలను మరియు నగలన్నింటిని ఒక పెద్దమూటలో కట్టి దానిని ఎత్తుటకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. ఆళ్వార్ వరుణ్ణి (మారు రూపములో ఉన్న ఎంపెరుమాన్) చూసి నువ్వు ఏదో మంత్రము వేశావు కాన ఈ మూట కదలడం లేదు ఆ మంత్ర పఠనాన్ని ఆపేయ్ అని గద్దించారు. ఎంపెరుమాన్ దీనికంగీకరించి మీకు శ్రద్ధ ఉంటే ఆ మంత్రాన్ని చెబుతానన్నారు. ఆళ్వార్ తన కత్తిని చూపించి వెంటనే దాని చెప్పవలసినదని గద్దించారు. ఎంపెరుమాన్ ఆ సర్వ వ్యాపక మంత్రమయిన తిరుమంత్రాన్ని ఆళ్వార్ చెవిలో అనుగ్రహించారు. ఇది అంతిమ లక్ష్య మును చేరుస్తుంది మరియు ఇది సకల వేదసారము, సంసార దుఃఖ సాగరము నుండి తరింపచేసేది, (ఐశ్వర్యం) కైవల్యం (స్వానుభవము) భగవత్ కైంకర్యమును అనుగ్రహించేది. ఈ తిరుమంత్రము యొక్క వైభవము శాస్త్రములలో ఇలా వర్ణించబడింది.
వృద్ధ హరీత స్మృతి నందు:
రుచో యజుశ్మి సామాని తతైవ అధర్వణాణి చ
సర్వం అష్ఠాక్షరాణంతస్థం యచ్చచాణ్యదపి వాఙ్ఞ్మయం
ఋగ్వేద, యజుర్వేద, సామ వేద మరియు అధర్వవేదముల సారము మరియు వాటి ఉపబృహ్మణముల సారమంతయి అష్ఠాక్షరి మంత్రములో ఇమిడి ఉన్నది.
నారదీయ పురాణమున:
సర్వవేదాంత సారార్థతసః సంసారార్ణవ తారకః |
గతిః అష్ఠాక్షరో నృణామ్ అపునర్భావకాంక్షిణామ్ ||
ఎవరికైతే మోక్షాన్ని సాధించాలి, సంసార సాగరమును దాటాలి అనే ఆకాంక్ష / ఆర్తి ఉండునో వారికి సకల వేద సారమగు అష్ఠాక్షరిమంత్రమే ఆశ్రయంచదగినది.
నారాయణోపనిషద్ నందు:
ఓమిత్య గ్రే వ్యాహరేత్ నమ ఇతి పచ్ఛాత్ నారాయణాయేతిఉపరిష్ఠాత్
ఓమిత్యేకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాని
నమః మరియు నారాయణాయ పదాలు ఓమ్ అను ఏకాక్షరంతో ఆరంభమగును. నమః పదము రెండక్షరములతో, నారాయణ పదం ఐదు అక్షరములతో (1+2+5=8 కావుననే ఈ మంత్రము అష్ఠాక్షరి అనబడుతుంది) ఉచ్ఛరించబడుతుంది. శాస్త్రములన్నీ ఈ మంత్ర స్వరూపాన్ని మరియు దోషరహిత ఉచ్ఛారణ విధాన్నాన్ని వర్ణిస్తున్నాయి.
నారదీయ పురాణమున:
మంత్రాణామ్ పరమో మంత్రోగుహ్యాణామ్ గుహ్యముత్తత్తమ్ |
పవిత్రన్యాచ పవిత్రాణామ్ మూలమంత్రస్సనాతనః||
అష్ఠాక్షరి మహా మంత్రము అన్నీ మంత్రములలో కెల్ల విశిష్ఠ మంత్రము, రహస్య మంత్రములలో కెల్ల రహస్యమైనది, పవిత్రములలో కెల్ల పవిత్రమైనది, అనాదియైనది / సనాతనమైనది మరియు శాశ్వతమైనది.
ఈ అష్ఠాక్షరి మహామంత్రం మహాఙ్ఞానులగు పూర్వాచార్యులచే అంగీకరించబడినది. దీనిని వారు తిరుమొళిలో 7.4.4 లో “పేరాళన్ పేరోదుమ్ పెరియోర్” భగవంతుని గుణ స్వభావాన్ని వర్ణించు విశేష నామముగా వర్ణించిరి. మరియు ఆళ్వార్ తన పెరియ తిరుమొళిలో మొదటి పదిగం (మొదటి 10 పాశురములలో) ఇలా తాము చెబుకుంటున్నారు “పెత్తతాయినమ్ ఆయిన చెయ్యుమ్ నలంతరుం శొల్లై నాన్ కండుకొండేన్” ఈ మంత్రం నాకు నా తల్లి చేయు మేలుకన్నా ఎక్కువ మేలు చేయునదని నేను కనుకొంటిని”. తిరు మంత్రాన్ని ఎంపెరుమాన్ దగ్గర విన్న తర్వాత, ఎంపెరుమాన్ సువర్ణమువలె ప్రకాశించు దివ్య గరుత్మాన్ మీద అధిరోహించి దయా స్వరూపిణి అగు శ్రీ మహాలక్ష్మిచే కూడి దర్శనమును అనుగ్రహించాడు.
స్వామి తన నిర్హేతుక కృపాకటాక్షము (కారణములేని దయ) వలన ఆళ్వార్ని అఙ్ఞాన లేశములేని ఙ్ఞానముతో ఆశీర్వదించారు. ఆళ్వార్ ఇదంతా కూడా శ్రీమహాలక్ష్మి యొక్క పురుషాకార పురస్సరముగా ఎంపెరుమాన్ అనుగ్రహించారని గ్రహించారు. వారు తమ ఆరు ప్రబంధములను అందరికి కృపచేసారు. నమ్మాళ్వార్ అనుగ్రహించిన నాలుగు దివ్య ప్రబంధములకు ఆరు అంగాలుగా తిరుంమంగై ఆళ్వార్ పెరియ తిరుమొళి, తిరుక్కురుదాణ్డకమ్, తిరువెళుకూత్తిరిక్కై , శిరియ తిరుమడళ్, పెరియ తిరుమడళ్ మరియు తిరునెడుందాణ్డకము లను అనుగ్రహించారు. వీరి ఆరు ప్రబంధములు వేరు వేరు కవిత్వపు రూపాలను కలిగి ఉన్నాయి – ఆశు, మధురం, చిత్తం మరియు విస్తారం. దీని కారణంగానే వీరికి ‘నాలు కవి పెరుమాళ్’ అనే నామము వచ్చినది.
ఆళ్వార్కు తమ శిష్యులతో కలసి అనేక దివ్య దేశములు దర్శించుకొని ఆయా దివ్య దేశములలో వేంచేసి ఉన్న అర్చావతార మూర్తులకు మంగళాశాసనములు చేయమని ఎంపెరుమాన్ ఆఙ్ఞాపించిరి. ఆళ్వార్ తన మంత్రులతో మరియు శిష్యులతో దివ్య దేశ యాత్రకు బయలుదేరి ఆయా దివ్య దేశపు నదులలో స్నానమాచరించి పెరుమాళ్ళకు మంగళాశాసనములను అనుగ్రహించిరి. అవి క్రమంగా భద్రాచలం, సింహాచలం, శ్రీకూర్మం, శ్రీపురుషోత్తమం (పూరి జగన్నాథము), గయా, గోకులం, బృందావనం, మధుర, ద్వారక, అయోధ్య, బదిరికాశ్రమం, కాంచీపురం, తిరువేంగడం మొదలైనవి.
ఆళ్వార్ అలా అనుగ్రహిస్తు చోళ మండలమునకు చేరుకొనిరి. వారి శిష్యులు వారిని “చతుష్కవులు వేంచేస్తున్నారు” “కలియన్ వేంచేస్తున్నారు” “పరకాలులు వేంచేస్తున్నారు” “ పర మతములను జయించినవారు వేంచేస్తున్నారు” అని కీర్తిస్తు ముందుకు సాగుచుంటిరి. అక్కడ నివసించు తిరుఙ్ఞాన సంబంధర్ అను శివ భక్తుని శిష్యులు ఆళ్వార్ను వారి శిష్యులు పొగడడాన్ని వ్యతిరేఖించారు. ఆళ్వార్ తమ గురువు గారిచే వాదించి నారాయణ పరతత్త్వమును (ఆధిపత్యాన్ని) స్థాపించాలని కోరారు. వారు ఆళ్వార్ను తిరు ఙ్ఞాన సంబంధర్ నివాస స్థలమునకు తీసికెళ్ళి జరిగినదంతా వివరించగా వారు ఆళ్వార్తో వాదానికి సిద్ధమయ్యారు. ఆ నగరమంతా అవైష్ణవులతో నిండి ఉన్నది. ఆ స్థిలో ఒక్క చోట కూడ ఎంపెరుమాన్ విగ్రహం లేని కారణంగా ఆళ్వార్ తమ వాదనను ఆరంభించుటకు సందిగ్ధపడసాగిరి.
ఆ సమయాన ఒక శ్రీవైష్ణవ భక్తురాలిని వారు గమనించి తమ తిరువారాధన మూర్తిని తీసుకరమ్మనగా ఆవిడ తమ తిరువారాధన మూర్తియగు శ్రీకృష్ణమూర్తిని తీసుకరాగా ఆళ్వార్ వారిని దర్శించి వాదానికి సంసిద్ధులయ్యారు. సంబంధర్ ఒక పద్యాన్ని వర్ణించగా ఆళ్వార్ దానిలో దోషారోపణ చేసిరి. సంబంధర్ ఆళ్వార్ తో మీరు వర్ణించండి అని సవాలు విసరగా ఆళ్వార్ వారితో తాడాళన్ ఎంపెరుమాన్ (కాళి చ్చీరామ విణ్ణగరం – శీర్గాళి) పైన ఉన్న “ఒరుకురలై ” పదిగాన్ని (పెరియ తిరుమొళి-7.4) వర్ణించిరి. ఆ పదిగము యొక్క విశేష వైభవ కూర్పుచేత సంబంధర్ బదులు సమాధానమీయలేక పోయిరి. చివరకు ఆళ్వార్ వైభవాన్ని అంగీకరించి వారిని కొలిచిరి.
ఆళ్వార్ శ్రీరంగమును దర్శించదలచి శ్రీరంగమునకు వెళ్ళి శ్రీరంగనాథునకు మంగళాశాసనములు మరియు కైంకర్యమును ఒనరించిరి.
బ్రహ్మాండ పురాణమున:
విమానం ప్రణవాకారం వేదశృంగం మహాద్భుతం శ్రీరంగశాయి భగవాన్ ప్రణవార్థ ప్రకాశకః
మహాద్భుతమైన శ్రీరంగ విమానం ఓంకారాన్ని అభివ్యక్తీకరిస్తున్నది; దాని శృంగం స్వయంగా వేదమే. భగవాన్ శ్రీరంగనాథుడు స్వయంగా తాను ప్రణవార్థమును అభివ్యక్తీకరిస్తున్నాడు (తిరుమంత్ర సారము).
ఆళ్వార్ శ్రీరంగమునకు ప్రాకారాన్ని నిర్మించాలని భావించి దానికి అయ్యే సంపదను (ఖర్చు) గురించి తమ శిష్యులతో మాట్లాడారు. దానికి వారు శ్రీ నాగ పట్టణమున అవైదిక సాంప్రదాయానికి చెందిన సువర్ణ ప్రతిమ ఉన్నది దానిని సంపాదించినచో మనం దానిని వినియోగించి చాలా కైంకర్యమును చేయవచ్చని విన్నవించిరి.
ఆళ్వార్ ఒక పర్యాయము నాగ పట్టణమున నివసించి ఈపట్టనమున ఏమైన రహస్యము /విశేషమున్నదా అని అక్కడ ఉన్న ఒక వనితను అడిగారు. ఆమె ఈ పట్టణమున ఒక ద్వీపనివాసి అగు గొప్ప వాస్తు శిల్పిచే నిర్మితమైన విగ్రహమున్నది, కాని అది అత్యంత పకడ్బందీగా విమానం ఉన్న దేవాలయంలో ఉంచబడిందని మా అత్తగారు చెబితే విన్నాన్నది. ఆళ్వార్ ఆ ప్రదేశానికి తన శిష్యులతో నివసిస్తూ ఆ విశ్వ కర్మ (దేవతల వాస్తుశిల్పి) తో సాటియగు ఆ వాస్తు శిల్పి గురించి విచారించసాగారు. ప్రజలు సుందరము మరియు విశాలమగు ఆ శిల్పి స్థలమును చెప్పగా ఆళ్వార్ అక్కడికి చేరుకొన్నారు. ఆళ్వార్ తన శిష్యులతో ఆ గృహంవెలుపల వివిధ విషయాల గురించి మాట్లాడుతుండగా ఆ శిల్పి స్నాన భోజనాదులు ముగించుకొని వెలుపలికి రాసాగిరి. ఆ శిల్పికి వినిపించేలా వ్యూహాత్మకంగా చాలా బాధాకరంగా ఇలా అన్నారు ఆళ్వార్ “అయ్యో! కొందరు దుండగులు నాగ పట్టణము ఉన్న దేవాలయాన్ని కూల్చి దానిలో ఉన్న సువర్ణ విగ్రహాన్ని దోచుకెళ్ళారు, ఇక మనం బ్రతికి వృధా”. ఇది విన్న ఆ శిల్పి చాల బాధాకరంగా బిగ్గరగా రోదిస్తు “విమాన గోపురపు శిఖరాన్ని తొలగించి సులువుగా లోపలికి ప్రవేశించు రహస్యాన్ని ఎవడో ఆకతాయి శిల్పి వెల్లడించి ఉంటాడు” నేను చాలా క్లిష్టంగా తాళపు చెవిని రహస్య పరచాను – రాతికి పక్కగా వంపుగా మెలిపెట్టిన ఇనుము గొలుసులను చేసి దానిని నీళ్ళు జాలువారు ఒక ఫలకం క్రింద ఉంచాను దాని నెలా ధ్వంసం చేశారు?” అని తనకు తెలియ కుండానే రహస్యాన్ని బయట పెట్టాడు.
ఈ రహస్యాన్ని విన్న ఆళ్వార్ తన శిష్యులతో ఆనందంగా ఆ స్థలాన్ని వదలి నాగపట్టణమునకు బయలు దేరుటకు సముద్ర తీరాన్ని చేరారు. ఆ సమయాన ఒక ధర్మపరాయణుడిగా ఉన్న ఒక వ్యాపారి తన వక్కలను ఓడ లోకి భారీగా రవాణా చేయుటను ఆళ్వార్ చూసి అతన్ని దీవించి తనను ఒడ్డుకు ఆ వైపునకు వదలమని ప్రాథేయపడ్డారు. వ్యాపారి అంగీకరించి సరుకును ఎక్కించి బయలుదేరారు. ప్రయాణంలో ఆళ్వార్ ఆ వక్కల రాశి నుండి ఒక వక్కను తీసుకొని దానిని రెండుముక్కలుగా చేసి ఒక ముక్కను ఆవ్యాపారి కిచ్చి తాను ఆ ముక్కను దిగేటప్పుడు తనకు ఇస్తానని “నేను ఆళ్వార్కు నా నావ నుండి సగం వక్కను ఇచ్చుటకు ఋణపడి ఉన్నాను” అని తన చేవ్రాలుతో ఒక చీటిని వ్రాసియ్యమనిరి.
అలా ఆ వ్యాపారి చేయగా, ఆళ్వార్ నాగ పట్టణము చేరుకోగానే ఆ రాశిలో నుండి ఖరీదైన సగం వక్కలను ఇవ్వమనిరి (శ్రీరంగ మందిర నిర్మాణ కైంకర్యమునకై) ఆ వ్యాపారి ఖంగుతిని దీనిని తిరస్కరించాడు. వారిద్దరు వాదులాడుకొని మిగితా వ్యాపారులను తటస్థతీర్పునకై అడగ్గా వారు సగం వక్కలను ఆళ్వార్ కు ఇవ్వ వలసినదే అని తీర్పునిచ్చారు. ఆ వ్యాపారి వేరు దారిలేక ఆ సగం వక్కలకు ఖరీదు సొమ్మును ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆళ్వార్ నాగ పట్టణము చేరుకొని రాత్రి అయ్యే వరకు దాక్కొనిరి. రాత్రిన ఆ ఫలకమును విరచి ఆ తాళపు చెవిని తీసుకొని విమానమును ఎక్కి ఇరుపక్కలా తిరుగు ఆ దారిని తెరిచి లోపల ధగాధగా మెరిసే విగ్రహమును చూసారు.
ఆ విగ్రహం ఇలా పలికినది “ఇయత్తై ఆగతో ఇరుంబినై ఆగతో , భూయత్తై మిక్కతొరు భూత్తత్తై ఆగతో తేయతే పిత్తలై నార్చెంబుగలైఆగతో మాయప్పొన్ వేణుమో మత్తత్తైన్నైప్ పణ్ణున్ గైక్కే”
“మీరు ఇనుము, ఇత్తడి, రాగి లాగా వినియోగిస్తారా? మీరు నన్ను దివ్య సువర్ణముగా భగవత్ కైంకర్యానికి వినియోగించాలన్న నా దగ్గరకు రావాలి” అన్నది. ఆళ్వార్ తన బావమరదిని విగ్రహాన్ని తీయుటకు వినియోగించి దానిని తీసుకొని తామందరు ఆ స్థలాన్ని వదిలారు. మరునాడు వారందరు ఒక చిన్న పట్టణమునకు చేరి దున్నేటువంటి ఒక స్థలమును చూసుకొన్నారు. దానిలో విగ్రహమును పాతి విశ్రాంతి తీసుకొన్నారు. వ్యవసాయదారులు వచ్చి ఆ నేలను దున్నగా వారికి విగ్రహం కనిపించిగా వారు తమదనుకొనిరి. ఆళ్వార్ ఇది తమ తాత తండ్రులదని వారు దీనిని ఈ నేలలో పాతిరనిరి. ఆ సంవాదంను నడుపుతూ చివరకు ఆ స్థలం యొక్క యజమానిని నేనే అని మీకు రేపు ఋజువు పత్రాన్ని చూపిస్తామనగా ఆ రైతులు సరేనని వెళ్ళి పోయారు. రాత్రికి ఆళ్వార్ ఆ విహ్రమును తీసుకొని తమ శిష్యులతో ఉత్తమర్ కోయిళ్ అనే దివ్యదేశానికి చేరుకొని ఆ విగ్రహాన్ని జాగ్రత్త పరిచిరి. అదే సమయాన ఆ నాగ పట్టణ దేవాలయపు కార్య నిర్వాహణాధికారి కొంత మంది స్థానిక నేతలతో ఆళ్వార్ని వెంబడిస్తూ విగ్రహాన్ని పాతిన స్థాలానికి అలాగే చివరకు ఉత్తమర్ కోయిల్ కు చేరుకొన్నారు. వారు ఆళ్వార్ను అడగ్గా మొదట ఆ విగ్రహము గురించి తెలియదని చెప్పి ఆ తరువాత చిటికన వేలు తప్పంచి విగ్రహపు భాగాన్ని వర్షాకాలం తరువాత వచ్చు ఫంగుణి (ఫాల్గుణమాసం) మాసం వరకు తిరిగి ఇచ్చేస్తానన్నారు.
ఆళ్వార్ ఒక పత్రాన్ని వ్రాసి చేవ్రాలు చేసి వారికివ్వగా వారి తిరిగి వెళ్ళిరి. ఆళ్వార్ వెంటనే ఆ విగ్రహాన్ని కరిగించి దానికి తగ్గ ఖరీదుకు అమ్మి ఆ వచ్చిన డబ్బుతో శ్రీరంగ దేవాలయ ప్రాకారాన్ని నిర్మాణం చేయ సాగిరి. ఆ ప్రాకారం తొండరడిపొడి ఆళ్వార్ నిర్మించిన నందనవనం మీదుగా వెళ్ళినప్పుడు ఆళ్వార్ వారి దివ్య భక్తిని గుర్తించి దానికి ఎటువంటి అపాయం చేయకుండ ప్రాకారం నిర్మించారు. దీనికి తొండరడిపొడి ఆళ్వార్ సంతోషించి ఆప్యాయతతో తిరుమంగై ఆళ్వార్కు వనసాధనం అను ‘అరుళ్ మారి’ అని పేరుని అనుగ్రహించారు. ఆళ్వార్ ఎంపెరుమాన్ కు కృతఙ్ఞతగా ఎన్నో కైంకర్యములను చేశారు.
వర్షాకాలం రానే వచ్చింది. ఆ నాగ పట్టణ దేవాలయ కార్య నిర్వాహాణాధికారి స్వర్ణ విగ్రహాన్ని తీసుకోవడానికి వచ్చాడు. వారు క్రితం రాసుకొన్న ప్రమాణ పత్రం ఆధారంగా ఆళ్వార్ స్వర్ణ విగ్రహపు చిటికెన వేలు తిరిగి ఇచ్చారు. దానికి ఆగ్రహించిన ఆ కార్య నిర్వాహాణాధికారి మధ్యవర్తులను ఆశ్రయించగా వారు కూడా ఆ ప్రమాణ పత్ర ఆధారంగానే తమ తీర్పును తెలుపగా ఆ కార్య నిర్వాహాణాధికారి చేసేదేమీ లేక కేవలం ఆ చిటికెన వేలును తీసుకొని బయలుదేరాడు. ఆ కార్య నిర్వాహాణాధికారి ఆళ్వార్ యొక్క యుక్తిని గ్రహించి ఇక మరేమి కోరక వెళ్ళిపోయిరి. ఆళ్వార్ నాగపట్టణ దేవాలయ చేసిన వాస్తు శిల్పులను పిలచి మీకు శ్రమ తగ్గట్టుగా సంపద నిచ్చెదను, అది ఆ నదీ తీరాన ఉన్నదని చెబుతారు. వారినందరినీ ఒక ఓడలో ఎక్కించి నదిలో కొంత దూరం ప్రయాణించిన పిదప ఆ పడవ నడిపేవాడికి సైగలు చేసి వాడును ఆళ్వార్ను వేరొక చిన్న పడవలోకి దూకి పోతారు. ఆ వాస్తుశిల్పులు ఉన్న ఓడను ముంచి వేస్తారు. ఆళ్వార్ తన ప్రదేశానికి తిరిగిరాగా ఆ వాస్తు శిల్పుల మనవలు వచ్చి వారి తాతల గురించి వాకబు చేస్తారు. వారికి నేను గొప్ప సంపదను చూపించాను వారు వాటిని సర్దుకొని మూటలను కడుతున్నారు, వాటితో సహా వస్తారన్నారు.
ఆ వాస్తు శిల్పుల మనవలు ఆళ్వార్ను అనుమానించి, మేము మా తాతలను క్షేమంగా ఇచ్చే వరకు తిరిగి వెళ్లమనిరి. ఆళ్వార్ చింతించగా శ్రీరంగనాథుడు స్వప్నమున సాక్షాత్కరించి “ మీరు ఇక బయపడనవసరం లేదు. వారినందరిని కావేరీ నదికి వెళ్ళి స్నాన మాడి ఊర్ధ్వ పుండ్రములను ధరించి నా ప్రధాన మండపమునకు వచ్చి వారి వారి తాతలను వారి వారి పేర్లను పిలుస్తు ఆహ్వానించమన్నారు”. శ్రీరంగనాథుని ఆఙ్ఞను శిరసావహించి ఆ శిల్పుల తాతలను క్రమంగా పిలవ సాగిరి. అప్పుడు వారి వారి తాతలు శ్రీరంగనాథుని ప్రక్కగా క్రమంగా వస్తూ వారి మనవలకు కనిపిస్తు ఇలా అన్నారు “మేము ఆళ్వార్ దివ్య కృపవలన శ్రీరంగనాథుని శ్రీపాదముల యందు చేరుకొన్నాము, కాన మీరు కూడ వారినాశ్రయించ వలసినది, ఈ సంసారమున కొంత కాలము సుఖంగా నివసించి తర్వాత ఉజ్జీవించండి” అని. వారు సంతోషంగా తాతల ఆఙ్ఞలను శిరసా వహించి ఆళ్వార్ను వారి ఆచార్యులుగా స్వీకరించి వారి వారి స్వస్థలాలకు తిరిగి వెళ్ళిరి.
పెరియ పెరుమాళ్, ఆళ్వార్ను మీకేమైన కోరిక ఉన్నదా అని అడిగారు. ఆళ్వార్ ఎంపెరుమాన్ యొక్క దశావతారాలను దర్శించాలని పెరియ పెరుమాళ్ని కోరారు.పెరియపెరుమాళ్ “మీ కోరిక ఇదే అయితే మీరు నా దశావతార అర్చామూర్తులను స్థాపించండి” అన్నారు. ఆళ్వార్ దశావతార సన్నిధిని శ్రీ రంగమున నిర్మించినారు.
తదనంతరం పెరియ పెరుమాళ్, ఆళ్వార్ బావమరదిని పిలచి వారికి ఆళ్వార్ అర్చామూర్తిని నిర్మించ వలసినదని ఆఙ్ఞనిచ్చారు (ఎందుకనగా ఆళ్వార్ వారి బావమరదికి ఆచార్యులు). వారు అలా ఆళ్వార్ అర్చా విగ్రహాన్ని తిరుక్కురయలూర్ నందు కూడా ఏర్పాటుచేసి, పెద్ద దేవాలయాన్ని నిర్మింపచేసి, ఆళ్వార్ ఉత్సవాలను అతి వైభవంగా జరుపసాగిరి. ఆళ్వార్ బావమరిది వెనువెంటనే ఆచార్య విగ్రహాన్ని వారి ధర్మ పత్నిఅయిన కుముద వల్లి నాచ్చియార్తో సహా ఏర్పరచి తిరుక్కురయలూర్కు అందరితో వెళ్ళి అర్చా విగ్రహాలను స్థాపించి అత్యంత వైభవంగా ఉత్సవములను జరిపించారు. ఆళ్వార్ తమ శిష్యులను ఉజ్జీవింప చేస్తూ నిరంతరం పెరియ పెరుమాళ్ని ఉపేయం మరియు ఉపాయంగా భావిస్తు ధ్యానించ సాగిరి.
వీరి తనియన్ :
కలయామి కలిధ్వంసం కవిలోక దివాకరం
యస్యగోభిః ప్రకాశాభిః ఆవిద్యం నిహతం తమః
వీరి అర్చావతార అనుభవం మునుపు ఇక్కడ వర్ణింపబడినది –http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-thirumangai.html.
అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస
మూలము: https://guruparamparai.koyil.org/2013/01/23/thirumangai-azhwar/
పొందుపరిచిన స్థానము – https://guruparamparai.koyil.org/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org
13 thoughts on “తిరుమంగై ఆళ్వార్”