మధురకవి ఆళ్వార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వవరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

madhurakavi

తిరునక్షత్రము: చిత్తా నక్షత్రము

మాసము: చైత్ర మాసము (చిత్తిరై / మేష)

అవతార స్థలము: తిరుక్కోళూర్ (ఆళ్వార్ తిరునగరి నవ తిరుపతులలో ఒకటి)

ఆచార్యులు: నమ్మాళ్వార్

శ్రీ సూక్తులు: కణ్ణినుణ్ శిరుత్తాంబు

పరమపదము చేరిన ప్రదేశము: ఆళ్వార్ తిరునగరి

నంపిళ్ళై తమ అవతారికా వ్యాఖ్యానంలో మధురకవి ఆళ్వార్ల కీర్తిని అతి వైభవంగా వివరించారు. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాము. మహాఋషులందరు తమ దృష్టిని సామాన్య శాస్త్రము నిర్ణయించే ఐశ్వర్యం, కైవల్యం మరియు పురుషార్థమైన (ఆత్మ పొందవల్సిన లక్ష్యం) భగవత్ కైంకర్యంపై కేంద్రీకరించారు. కాని ఆళ్వారులు తమ దృష్టిని శ్రీమన్నారాయణునకు ప్రీతిని కలిగించే ఉత్తమ పురుషార్థము (అంతిమ లక్ష్యం)పై కేంద్రీకరించారు. మధురకవి ఆళ్వార్ మాత్రం తమ దృష్టిని అత్యుత్తమ స్థితి అయిన భాగవత కైంకర్యంపై కేంద్రీకరించారు. భగవంతుడు తన కన్నా తన భక్తులకు చేయు కైంకర్యమే విశేషమని ప్రశంసించాడు. దీనిని మనం శ్రీరామాయణంలో చూడవచ్చు. శ్రీరామాయణం వేదోపబృహ్మణం (వేదం యొక్క క్లిష్టమైన అర్థాలని వివరించేది). ఇది వేద ప్రధాన అంశాలని నిర్ణయుంచును.

  • శ్రీరాముడు వేద స్వరూపుడు – కావున తాను సామాన్య ధర్మమైన పితృవాక్ పరిపాలనను నిరూపించినాడు.
  • ఇళయ పెరుమాళ్(లక్ష్మణుడు) – విశేష ధర్మమైన శేషత్వమును నిరూపించినాడు. అనగా శేషుడు (దాసుడు) సదా శేషిని (ప్రభువు / యజమానిని) అనుకరించడం. లక్ష్మణుడు, “అహం సర్వం కరిష్యామి” (మీ కోసం నేనన్నింటిని చేయుదును) అనే దానిని శ్రీరాముని యందు అనుష్ఠించి చూపినాడు.
  • భరతుడు – విశేష ధర్మమైన పారతంత్ర్యమును నిరూపించినాడు. ఇది జీవాత్మల అసలైన స్వరూపం. తన స్వాతంత్ర్యం లేకుండా ప్రభువు / యజమాని ఇచ్ఛను అనుసరించి నడుచు కొనుటయే పారతంత్ర్యం. కాని శ్రీరాముడు భరతున్ని అయోధ్య నగరంలోనే ఉండి రాజ్యాన్ని సంరక్షించాలని కోరినాడు. భరతుడు నిర్భంధముగా శ్రీరాముని ఆఙ్ఞను ఒప్పుకొని తను 14 సంత్సరములు అయోధ్యానగరం వెలుపల అదే స్వరూపంతో శ్రీరామునికై  ఎదురుచూసాడు.
  • శత్రుఘ్నుడు – సంగ్రహంగా తన స్వరూపమునకు తగిన భాగవత శేషత్వమును నిరూపించినాడు. ఇతను ఇతర వ్యాపకముల యందు శ్రద్ధ చూపక కేవలం భరతుని యందు కైంకర్యమునే ఆసక్తితో అనుష్ఠించినాడు.

ఇక్కడ నంప్పిళ్ళైగారు శ్రీభాష్యకారుల (శ్రీరామానుజుల) వచనమును ఉట్టంకిస్తు, శ్రీరాముడు తన ఇద్దరి సోదరులైన లక్ష్మణుని మరియు భరుతుని కన్నా సర్వపారతంత్రుడైన శత్రుఘ్నునియందే అధికమైన ప్రీతిని కలిగి ఉండేవారని తెలిపారు. మధురకవి ఆళ్వార్ భాగవత కైంకర్య నిష్ఠ నిరూపించిన శత్రుఘ్నుని యందు అధికమైన ప్రీతిని కలిగి ఉండేవారు. మధురకవి ఆళ్వార్ కూడా నమాళ్వార్లకు పరిపూర్ణ దాసుడై వారికి నిత్య కైంకర్యమును చేసెడివారు. మధురకవి ఆళ్వార్లకి నమ్మాళ్వారే లక్ష్యం (ఉపాయం) మరియు దానిని పొందించేవారు (ఉపేయం) కూడా ఆళ్వారే. దానినే మధురకవి ఆళ్వార్ తమ దివ్యప్రబంధము యందు నిరూపించారు.

పిళ్ళై లోకాచార్యులు తమ మహత్తరమైన శ్రీవచన భూషణంలోని చివరి ప్రకరణలో మధురకవి ఆళ్వార్ వైభవమును మరియు వారికి నమ్మాళ్వార్ల యందు ఉన్న భక్తి భావమం, ఆచార్య అభిమాన నిష్ఠ (ఆచార్య అభిమానమే ఉత్తారకంగా భావించుట) కు ఉదాహరణగా తన సూత్రములో సవివరంగా వివరిస్తారు.

8వ ప్రకరణలో భగవంతుని నిర్హేతుక కృప వర్ణించబడినది. భగవంతుడు జీవాత్మకు ఫలితమునలను వారి కర్మానుసారంగా ఇవ్వడానికి బద్ధుడై ఉంటాడు. కాని మనను భగవంతుడు ఆమోదిస్తాడా లేడా అని సందేహం కలవచ్చు.

9వ ప్రకరణములో (చివరన) పిళ్ళై లోకాచార్యులు, ఆచార్యునిపై ఆధారపడిన చరమోపాయము (అంతిమోపాయము) మరియు ఆ చరమోపాయము వలన జీవాత్మ ఎలా అప్పగించబడునో తెలిపినారు.

407 సూత్రమును పరిశీలించిన, సర్వ సతంత్రుడైన భగవతుండు మనను స్వీకరిస్తాడా లేదా నిరాకరిస్తాడా అని సందేహం కలుగవచ్చు ఇది శాస్త్రానుసారము (ఫలితములు వారి వారి కర్మానుసారంగా ఇవ్వబడేవి) గా అతని మీద లేదా భగవానుని  కారుణ్యం మీద ఆధారపడి ఉంటుంది.

మణవాళ మాముణులు తమ వ్యాఖ్యానంలో- ఎప్పుడైతే మనం పారతంత్రుడైన (సర్వం భగవంతుని మీదనే ఆధారపడిన వారు) ఆచార్యుని ఆశ్రయిస్తామో ఇక మనకు ఏ సందేహము లేదు విమోచనము (మోక్షము) కలుగును. కారణం ఆచార్యుడు జీవాత్మ ఉద్ధరణకై నిరంతరం కృషి చేయు కరుణామూర్తి.

408వ సూత్రంలో ఇలా వివరించబడినది – సర్వం భగవంతునిపై ఆధారపడిన పదుగురు ఆళ్వార్లు తమ పాశురాలలో దీనిని నిరూపించలేదు. ఈ ఆళ్వార్లు ఏ లోపం లేని ఙ్ఞానమును భగవంతుని ద్వారా పొందారు. వారు భగవదనుభవంలో  నిమగ్నమైనప్పుడు భాగవతులను కీర్తిస్తారు. భగవంతునితో సంశ్లేషము కలిగినపుడు భాగవతుల విషయంలో కలతచెంది తీరని ఆశతో ఉండేవారు (మణవాళ మాముణులు వాఖ్యానములో చాలా పాశురములలో ఈ విషయం పేర్కొనబడినది). మనము ఆచార్య వైభవాన్ని పదుగురి ఆళ్వార్ల పాశురాలలో నిర్ణయించ లేము కాని మధురకవి ఆళ్వార్ (ఆండాళ్ పాశురాలలో కూడా) పాశురాలలో ఈ వైభవమును పరిశీలించవచ్చని మామునుల కృప చేశారు.

409వ సూత్రంలో, మిగిలిన పదుగురు ఆళ్వార్ల కన్నా మధురకవి ఆళ్వార్ చాలా గొప్పవారు అనడానికి కారణం, వారి దృష్టి అంతా ఆచార్య వైభవము పైననే ఉండును. కాని మిగిలిన ఆళ్వార్లంతా ఒకసారి భాగవతులను కీర్తిస్తారు మరొకసారి విస్మరిస్తారు. మధురకవి ఆళ్వార్ వచనములను బట్టి మనము ఆచార్య వైభవమును సిద్ధాంతీకరించవచ్చు. మామునులు తమ ‘ఉపదేశరత్నమాల’ లో 25వ మరియు 26వ పాశురములలో మధురకవి ఆళ్వార్ని మరియు వారి ప్రబంధమైన ‘కణ్ణిణున్ శిరుత్తాంబును’ కీర్తిస్తారు. 25వ పాశురంలో మధురకవి ఆళ్వారులు అవతరించిన చైత్రమాస చిత్తా నక్షత్ర దివసం ప్రపన్నుల స్వరూపానికి తగిన రోజని, ఇది మిగిలిన ఆళ్వారుల అవతారదివసం కన్నా విశేషమయినదని వివరించారు.

ఎరార్ మధురకవి | ఇవ్వులగిల్ వన్దుఉదిత్త
శీరారుం శిత్తిరైయిల్ | శిత్తిరైయిల్ , పారులగిల్
మర్ట్రుళ్ళ ఆళ్వార్ గళ్ | వందుదిత్తనాళ్ గళిలుమ్
ఉర్ట్రదు ఎమక్కెన్ఱు | నెఙ్జే ! ఓర్ (25)

వాయ్ త్త తిరుమన్దిరత్తిన్ |మత్తిమమాం పదంపోల్
శీర్తమధురకవి |శెయ్ కలైయై – ఆర్తపుగళ్
ఆరియర్ గళ్ తాఙ్గళ్ |అరుళిచ్చెయల్ నడువే,
శేర్విత్తార్ | తాఱ్పరియం తేర్ న్దు (26)

పిళ్ళై లోకం జీయర్ ఈ పాశురానికి విశేషమైన వివరణ అనుగ్రహించారు: కణ్ణినుణ్ శిరుత్తాంబును తిరుమంత్రములోని ‘నమః’ పదానికి ఉదాహరణగా స్వీకరించారు. తిరుమంత్ర మననము చేసేవారిని ఈ సంసార బంధము నుండి విముక్తి చేయునదిగా ప్రసిద్ధి చెందినది. తిరు మంత్రములో ‘నమః’ పదం చాలా ప్రాధాన్యత కలిగినది. మన రక్షణాభారములో మన ప్రమేయమే ఉండదు, మన రక్షణాభారమంతా స్వామిదే (ఎమ్పెరుమాన్) అనే విషయాన్ని ఇది ధృడీకరించును. ఈ సూత్రమునే మధురకవి ఆళ్వార్ (పరమ ఆచార్యనిష్ఠులు) తమ ప్రబంధములో పొందుపరిచారు. దీని ఆధారంగానే మన రక్షణాభారమంతా ఆచార్యులదే అని తెలియును. ఈ విషయ వాస్తవికతయే శాస్త్ర సారాంశము, కావుననే మన పూర్వాచార్యులు వీరి ప్రబంధమును నాలాయిర దివ్య ప్రబంధములో చేర్చినారు. మధురకవి ఆళ్వార్ అవతరించిన చిత్తా నక్షత్రము 27 నక్షత్రములలో సరిగ్గా మధ్యన ఉండును, అలాగే వీరి ప్రబంధము కూడ దివ్య ప్రబంధ రత్నహారమునకు నాయక రత్నం వలె మధ్యలో విరాజిల్లుతున్నది. ఎంబెరుమానార్ (రామానుజులు), నంప్పిళ్ళై,  పిళ్ళై లోకాచార్యులు, మాముణులు మరియు పిళ్ళై లోకం జీయర్ మొదలైన వారందరు ఈ విషయాన్నే వివిధ కోణములలో చాలా అందముగా వివరించారు. వీటిని ఆధారంగా చేసుకొని మనము మధురకవి ఆళ్వార్ చరితమును తెలుసుకుందాము.

మధురకవి ఆళ్వార్ చైత్ర మాసంలో చిత్తా నక్షత్రమున తిరుక్కోళూర్ అనే దివ్యదేశములో (ఆళ్వార్ తిరునగరి నవ తిరుపతులలో ఒకటి) అవతరించిరి. సూర్యునికి ముందే కిరణముల కనిపించినటుల నమ్మాళ్వార్ల అవతారమునకు ముందే వీరి అవతారం జరిగినది. వీరి వైభవమును గరుడ వాహన పండితుని ‘దివ్యసూరిచరితం’లో అవలోకించిన, వీరు కుముదగణేశుని లేదా గరుడుని (ఆళ్వారులందరు ఈ సంసారము నుండి పెరుమాళ్ చే ఉద్ధరింపబడి వానిచే ఆశీర్వదింపబడినవారు) అంశ అని తెలుస్తున్నది. వీరు సామవేదీయ పూర్వశిఖా బ్రాహ్మణ వంశములో జన్మించిరి. తగిన వయస్సులో వీరికి జాతకకర్మ, నామకరణ, అన్నప్రాసన, చౌల, ఉపనయనాది వైదిక సంస్కారములన్నీ జరిగాయి. క్రమంగా వేద వేదాంతములు, ఇతిహాస పురాణములను అధికరించినారు. పెరుమాళ్ ను తప్ప ఇతరములను పరిత్యజించి ఉత్తర భారతావనిలోని అయోధ్య, మధుర మొదలైన దివ్యదేశాలను సేవించుటకు యాత్రను చేసిరి.

nammazhwar-madhurakavi-nathamuni

మధురకవి ఆళ్వార్, నమ్మాళ్వార్, నాథమునులు – కాంచీపురం

మధురకవి ఆళ్వార్ తరువాత అవతరించిన నమ్మాళ్వార్ ఇతరముల యందు అనాసక్తితో, తల్లిపాలను కూడ స్వీకరించక, నిశబ్దతతో (పూర్తిగా శబ్దము లేకుండా) ఉండిరి. వీరి తల్లి దండ్రులైన ఉడయనంగైకారిలు, అవతరించిన 12వ దివసమున వీరి బాల్య ప్రవర్తనకు ఆతృత చెందిరి. ఆళ్వార్ తిరునగరి తామ్రపర్ణినదీ దక్షిణ తీరాన అందమైన గోపురములను కలిగిన, అందమైన దివ్య శంఖ చక్రములతో అలరారుతున్న, పద్మముల వంటి నేత్రములను కలిగిన, అభయ హస్తముతో (మనను రక్షించెదను అను నిర్థారించు హస్తము కలిగిన స్థితి) కూడిన, దివ్య మహిషిలైన శ్రీభూనీలా దేవేరులతో కూడిన  ‘పొలిన్దునిన్ఱపిరాన్’ వద్దకు తీసుకవచ్చిరి. పెరుమాళ్ సన్నిధిన ఆ బాలునకు ‘మాఱన్’ (ఇతరుల నుండి వ్యత్యాసముతో ఉండువాడు) అని పేరుంచి దివ్య చింతచెట్టు సన్నిధిన వదిలి దివ్యునిగా భావించి ఆరాధించసాగిరి.

పరమపదనాథుడు నమ్మాళ్వారకు పంచ సంస్కారములను చేసి ద్రావిడ వేదమును (ఈ వేదం అనాదిగా ఉన్నదని నాయనార్లు తమ ‘ఆచార్య హృదయము’ లో తెలిపిరి) మరియు అన్నీ రహస్య మంత్రములు, వాటి అర్థములను ఉపదేశించమని విష్వక్సేనులను నిర్దేశించగా విష్వక్సేనుల   వారు ఆ బాధ్యతను నెరవేర్చిరి. నమ్మాళ్వార్ 16 సంవత్సరములు ఆ తిరుపుళిఆళ్వార్ (దివ్య చింతచెట్టు) క్రింద ఉన్నారు. ఆ గొప్పదనమును ఆళ్వారుల తల్లిదండ్రులు గమనించినారు కాని వారి వైభవమును గుర్తించ లేకపోయినారు. అలా తిరుక్కురుంగుడి నంబిని ప్రార్ధన చేస్తు ఉండి పోయినారు. మధురకవి ఆళ్వార్ కూడా ఈ వింత విషయాన్ని విన్నారు. ఒకనాడు వారు రాత్రి సమయాన నదీ తీరానికి వెళ్ళినప్పుడు దక్షిణ దిశ వైపు పెద్ద వెలుగు అగుపించినది వారికి. మొదట వారు ఏదో ఊరు తగలబడి పోతుందని భావించినారు, కాని అదే వెలుగు వారికి మరుసటి రాత్రి కూడ కనబడినది. సరే దీనిని కనిపెడదామని నిశ్చయించుకొని దిన భాగములో నిద్రించి రాత్రి భాగాన ఆ దిశ (దక్షిణ) వైపు పయనించసాగిరి. ప్రయాణంలో ఎన్నో దివ్య దేశాలను పరిశీలనగా సందర్శిస్తూ చివరకు శ్రీరంగమును చేరుకొనిరి.

అయినను వారికి దక్షిణ దిశ వైపు ఆ దివ్యవెలుగు కనబడసాగినది. చివరకు తిరుక్కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి) చేరిన తర్వాత ఆ వెలుగు కనబడలేదు. ఆ వెలుగు ఈ ప్రదేశము నుండే వచ్చినదని నిర్థారించుకొనిరి. పిమ్మట దేవాలయంలోకి ప్రవేశించిగానే వారికి ఙ్జాన పరిపూర్ణులుగా, అందమైన నేత్రాలతో ,16 ఏండ్ల నూతన వయస్కుడైన, పూర్ణిమా చంద్రుని వలె, పద్మాసనములో వేంచేసి కూర్చునటువంటి, భగవంతుని గురించి ఉపదేశిస్తున్న ఉపదేశ ముద్రతో, సమస్త ప్రపన్నులకు ఆచార్యునిగా, సంపూర్ణ భగవదనుభవములో మునిగి ఉన్న నమ్మాళ్వార్ దర్శనమిచ్చిరి. మధురకవి ఆళ్వార్ ఒక రాయిని తీసుకొని వారి ముందు పడవేసిరి. ఆళ్వార్ తమ సుందర నేత్రాలను విప్పి మధురకవి ఆళ్వార్ని చూసారు. వారు ఈయన మాట్లాడతారా అని పరీక్షించదలచి ఆళ్వార్ తో ఇలా అనిరి.

“శిత్తత్తిన్ వయిఱిళ్ శిరియతు పిరన్దై ఎత్తత్తై త్తిన్ఱు ఎంగేకిడక్కుం”

దీనర్ధం – చేతనుడు (జీవాత్మ – అజడము) అచేతనములోకి (జడము) ప్రవేశించగానే ఎక్కడ ఉండును? ఏమి అనుభవించును? దీనికి ఆళ్వార్ అత్తత్తైతిన్ఱు అంగై కిడక్కుం” “కార్యరూప ఆనందమును దు:ఖములను అనుభవిస్తు అక్కడే శాశ్వతంగా ఉండును” అని అనిరి. ఇది విన్న మధురకవి ఆళ్వార్ ఇతనిని సర్వఙ్ఞునునిగా  గుర్తించి ఇక నేను నా ఉజ్జీవనమునకై ఇతనికి సర్వ కైంకర్యములను చేయుదును అని నమ్మాళ్వార్ శ్రీపాద పద్మల యందు మోకరిల్లిరి. సదా వారి సేవలోనే ఉంటూ వారి గుణగణాలను కీర్తించసాగిరి.

అన్నింటికి కారణ భూతుడైనవాడు, అన్నింటికి అధికారి, అన్నింటిని నియంత్రించేవాడు, సర్వంతర్యామిగా ఉండేవాడు, నల్లని/నీలపు తిరుమేనితో అలరారు శ్రీవైకుంఠనాధుడు నమ్మాళ్వార్ కు దర్శనమిచ్చుటకు సంకల్పించగానే, పెరియ తిరువడి (గరుడ) వాలగా తన దేవేరి మహాలక్ష్మితో అధిరోహించి తిరుక్కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి) వచ్చి దర్శనమును మరియు అనంత ఙ్ఞానమును నమ్మాళ్వార్ కు అనుగ్రహించిరి. శ్రీవైకుంఠనాధునిచే అనుగ్రహింపబడిన నమ్మాళ్వార్ సంపూర్ణంగా భగవదనుభవములో మునిగి తనివితీరా అనుభవించి పొంగి పొరలే ఆ ఆనందానుభవం లోపల ఇముడ్చుకోలేక పాశురాల (పద్యములు) రూపములో గానంచేసిరి. అవి తిరువిరుత్తం, తిరువాశిరియం, పెరియ తిరువన్దాది మరియు తిరువాయ్మొళి (నాలుగు వేదాల సారమయిన) అనే ప్రబంధములుగా, శ్రీవైకుంఠనాధుని స్వరూపములను, గుణగణములను, అవతారములను కీర్తించిరి. వాటినే నమ్మాళ్వార్ తన శిష్యులగు మధురకవి ఆళ్వార్ కు ఇతర శ్రద్ధాలువులకు అనుగ్రహించిరి. అన్నీ దివ్యదేశ పెరుమాళ్ళు నమ్మాళ్వార్ కూర్చున్న తిరుపులిఆళ్వార్ (చింతచెట్టు) దగ్గరకు వేంచేసి ఆళ్వార్ కు ఆశీర్వదించి తాము ఆళ్వార్ చే మంగళాశాసనం చేయించుకున్నారు. నమ్మాళ్వార్ అందరిచే ఆశీర్వదించబడి, అందరికిని మంగళాశాసనములను చేసిరి. అలాగే నిత్యసూరులు (పరమపదవాసులు) శ్వేత దీప వాసులు (క్షీరాబ్ధివాసులు) రాగా మహిమ గల నమ్మాళ్వార్లచే వారు మంగళాశాసనములను పొందిరి.

నిత్యసూరుల, శ్వేత దీప వాసుల మహిమలో మునిగిన నమ్మాళ్వార్ తమను తాము విశ్వములో గొప్పవారిగా భావించు కొనిరి (భగవానుని అనుగ్రహము వలన సాత్విక అహంకారం ఉదయించెను). నమ్మాళ్వార్ తాము సదా కణ్ణన్ (శ్రీకృష్ణుని) తలుచుకొనేవారు. నమ్మాళ్వార్ అర్ధ పంచక ఙ్జానమును (పరమాత్మ స్వరూపం, జీవాత్మ స్వరూపం, ఉపాయ స్వరూపం, ఉపేయ స్వరూపం, విరోధి స్వరూపం) మరియు దివ్య మహామంత్రమును (అష్ఠాక్షరి) అమృతము వంటి పెరుమాళ్ ని భక్తులకు తమ తిరువాయ్మొళి ద్వారా వివరించిరి. చివరకు నమ్మాళ్వార్ తమ 32వ ఏట సంసారమును వీడి పరమపదమునకు భగవానుని దయ వలన చేరుకొనిరి. ఆ సమయాన నమ్మాళ్వార్ (ప్రపన్న జనకూటస్థులు – ప్రపన్నులకు మూల పురుషులు) ప్రధాన శిష్యులైన మధురకవి ఆళ్వార్ ఆచార్య ప్రభావం గల ‘కణ్ణినుణ్ శిరుత్తాంబు’ను రచించి పంచమోపాయ నిష్టులైన (5వ ఉపాయము – మిగితా ఉపాయములు కర్మ, ఙ్జాన, భక్తి మరియు ప్రపత్తి) ముముక్షువులకు అనుగ్రహించినారు. మధురకవి ఆళ్వార్, నమ్మాళ్వార్ అర్చా విగ్రహమును ఆళ్వార్ తిరునగరి యందు ప్రతిష్ట చేసి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవ మొదలైన ఉత్సవములను అతివైభవముగా జరిగేలా ఏర్పాటు చేసిరి.

మధురకవి ఆళ్వార్, నమ్మాళ్వార్ లను ఇలా కీర్తించిరి:

వేదం తమిజ్ శెయ్ ద పెరుమాళ్ వందార్, తిరువాయ్ మొజి పెరుమాళ్ వందార్, తిరునగరి పెరుమాళ్ వందార్, తిరువాజుతివళందార్ వందార్, తిరుక్కురుగూర్ నంబి వందార్, కారిమారన్ వందార్, శఠగోపర్ వందార్, పరాంకుశర్ వందార్.

సరళ వ్యాఖ్యానము: వేద సారాన్ని కృప చేసినవారు వేంచేస్తున్నారు, తిరువాయ్మొళి రచయిత వేంచేస్తున్నారు, తిరునగరి అధికారి వేంచేస్తున్నారు, కారి కుమారులు వేంచేస్తున్నారు, శఠగోపులు వేంచేస్తున్నారు, పరాకుంశులు (ఇతర మతస్తులకు అంకుశం వంటివారు) వేంచేస్తున్నారు అహో!

ఒకసారి దక్షినాది నుండి వచ్చిన ‘మధురై తమిళ్ సంఘ’ తమిళ పండితులు నమ్మాళ్వార్ల గొప్పదన్నాన్ని అంగీకరించ లేదు. వారు సంఘ ఫలకం (సాహిత్య విలువను కొలిచే ఒక పీఠం) వీరి సాహిత్యాన్ని అంగీకరించునో అప్పటి వరకు మేము నమ్మాళ్వార్ వేద సారాన్ని అందిచారు అనే దానిని ఒప్పుకోమన్నారు. మధురకవి ఆళ్వార్, మా ఆచార్యులు నమ్మాళ్వార్ ఎక్కడికి వేంచేయరు అని వారు అనుగ్రహించిన తిరువాయ్మొళి 10.5.1 లోని “కణ్ణన్ కళళినై”  అనే పాశుర ఖండాన్ని ఒక తాళ పత్రముపై వ్రాసి ఆ పండితులకు ఇచ్చిరి. ఆ పండితులు ‘ఒకవేళ ఈ పాశురఖండాన్ని సంఘ పీఠము అనుమతిస్తే మేము ఆళ్వార్ గొప్ప అని భావిస్తాము’ అనిరి.

ఆ సంఘపీఠ అధికారి ఆ పాశుర తాళపత్రాన్ని 300 మంది మహా పండితులు కూర్చున్న సంఘ పీఠముపై నుంచగా ఆ సంఘ పీఠం 300 మహా పండితులను క్రిందకు పడవేసి ఆళ్వార్ పాశుర తాళపత్రాన్ని మాత్రమే నిలుపుకొన్నది. ఆ సంఘ పీఠ అధికారి ఆళ్వార్ వైభవమును ఒప్పుకొని ఒక పద్యాన్ని సమర్పించారు.

“లాదువతో గరుడర్ కీతిరే ఇరావికితిర్ మిన్మనియాదువతో నాయొదువథో యుఱుమిప్పులిమున్ నరికేచరిమున్ నదైయాదువదో పేయదువదో ఎజిలుర్వచిమున్ పెరుమానందిచేర్ వకుళాభరణన్ ఒరాయిరమామఱైయిన్ తమిళ్ ఒరు చొల్ పొరుమో ఉలగిల్ కవియే”

దీనర్ధం నమ్మాళ్వార్ (శ్రీమన్నారాయణునకు ఆధీనుడై ఉండి వేదసారాన్ని 1000 పాశురములలో కూర్చిన) యొక్క ఈ పాశురాన్ని లోకములోని కవుల ఏ పద్యములతో కూడ పోల్చలేము పోల్చినా ఇలా ఉండును.

* ఎగిరే సామర్థ్యములో ఈగకు గరుడకి మధ్యన ఉన్న వ్యత్యాసం
* వెలుతురులో సూర్యునికి మిణుగురుపురుగుకు ఉన్న వ్యత్యాసం
* పులి గాండ్రింపుకు కుక్క మొరగుకు ఉన్న వ్యత్యాసం
*  సింహపు రాచరిక నడకకు నక్క సాధారణ నడకకు ఉన్న వ్యత్యాసం
* దేవ నర్తకి ఊర్వశి నాట్యానికి దయ్యపు నాట్యానికి ఉన్న వ్యత్యాసం
ఇది గననించిన కవులందరూ వారి చేసిన తప్పిదానికి క్షమాప్రార్ధన చేసినారు. మధురకవి ఆళ్వార్ తన జీవితమంతా “గురుం ప్రకాశతే ధీమాన్” అనునట్లుగా ఆచార్య వైభవమునే (ఆళ్వార్) కీర్తించడానికే వెచ్చించారు. ఆచార్యుల ప్రభావం వలన అందరు ఉజ్జీవింపబడతారు. కొద్దికాలం తర్వాత మధురకవి ఆళ్వార్ తమ ఆచార్యుల (నమ్మాళ్వార్) తిరువడి (పాదపద్మములు)ని చేరుకొని వారికి నిత్య కైంకర్యములు చేయసాగిరి.

వీరి తనియన్:

అవిదిత విషయాంతర శఠారేః ఉపనిషదాముపగాన మాత్ర భోగః|
అపిచ గుణవశాత్తదదైక శేషి మధురకవి హృదయే మమా విరస్తు||

అడియేన్ నల్లా శశిధర్   రామానుజదాస

మూలము: https://guruparamparai.koyil.org/2013/01/17/madhurakavi-azhwar/

పొందుపరిచిన స్థానము – https://guruparamparai.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

16 thoughts on “మధురకవి ఆళ్వార్”

Leave a Comment